రియల్‌ హీరో ఈ ఐఏఎస్‌ అధికారి

IAS Kannan Gopinathan Worked At Relief Camp - Sakshi

తిరువనంతపురం : కేరళ సహాయ శిబిరాల వద్ద కొన్ని రోజులుగా ఓ యువకుడు మూటలు మోస్తూ.. అక్కడివారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సహాయక శిబిరాలకు వచ్చిన వస్తువులను ట్రక్కులనుంచి కిందకు దించి వాటిని అవసరమైన వారికి చేరుస్తున్నాడు. గత ఎనిమిది రోజులుగా అతడు ఇవే పనులు చేస్తున్నాడు. తొమ్మిదో రోజు ఆ వ్యక్తిని కాస్తా పరిశీలనగా చూసిన ఓ అధికారి ఆశ్చర్యంతో ‘సార్‌.. మీరు ఏంటి ఇక్కడ, ఇలా..?’ అని అడిగాడు. అంతవరకూ అతన్ని తమలాంటి ఓ సాధరణ వాలంటీర్‌ అనుకున్న వారికి ఆ వ్యక్తి గొప్పతనం గురించి తెలిసింది. దాంతో ఆ వాలంటీర్‌తో సెల్ఫీ దిగడానికి వారంతా ఎగబడ్డారు. మూటలు మోసే వ్యక్తితో సెల్ఫీ దిగడం ఏంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే మూటలు మోస్తున్న ఆ వాలింటీర్‌ ఓ జిల్లా కలెక్టర్‌. కలెక్టర్‌ ఏంటి.. ఇలా మూటలు మోయడమెంటీ అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరి చదవండి.

కేరళకు చెందిన కన్నన్‌ గోపీనాథన్(32) 2012 బ్యాచ్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి. శిక్షణ అనంతరం అతనికి కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో కేరళలో సంభవించిన వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కేరళను ఆదుకోవడానికి దేశమంతా తరలి వచ్చింది. అందులో భాగంగా పలు రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని అందించాయి. అలా సాయం చేసిన వాటిలో దాద్రా నగర్‌ హవేలీ కూడా ఉంది. ప్రస్తుతం అక్కడే కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోపీనాథన్ దాద్రా నగర్‌ హవేలీ తరపున కోటి రూపాయల చెక్కును కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించేందుకు వచ్చాడు.

ఆ పని ముగిసిన తర్వాత తిరువనంతపురం నుంచి తన సొంత ఊరు పుతుపల్లికి వెళ్లాల్సిన గోపీనాథన్ కాస్తా వరదల ధాటికి తీవ్రంగా నష్టపోయిన చెంగన్నూర్‌కి వెళ్లి సహాయక శిబిరాల్లో ఉంటూ వాలంటీర్‌గా బాధితులకు సేవ చేయడం ప్రారంభించాడు. ఇలా 8 రోజులు గడిచిపోయింది. అనంతరం ఓ అధికారి గోపీనాథన్‌ని గుర్తుపట్టడంతో అతని గురించి అక్కడివారికి తెలిసింది. దీంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

వాలంటీర్‌గా పని చేయడం గురించి గోపీనాథన్ మాట్లాడుతూ.. ఇక్కడి అధికారులు పడిన శ్రమతో పోలిస్తే.. నేనేం గొప్ప పని చేయలేదని వినయంగా చెప్పుకొచ్చాడు. నన్ను హీరో చేయొద్దు, క్షేత్ర స్థాయిలో ఇక్కడెంతో మంది సాయం చేస్తున్నారు. వారే రియల్ హీరోలు. ఇదే స్ఫూర్తితో అంతా కష్టపడితే.. త్వరలోనే కేరళ తన పూర్వ వైభవాన్ని పొందుతుందని గోపినాథన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top