
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు కేంద్రం నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (ఎన్‌ఈఏటీ) అనే పథకాన్ని ప్రకటించింది. ‘విద్యార్థుల అవసరాల మేరకు వారి వ్యక్తిగత అభిరుచుల సహకరించేలా కృత్రిమ మేథస్సును ఉపయోగించడం దీని లక్ష్యం. దీనికి సంబంధించిన స్టార్టప్ సంస్థలను ఒక వేదిక పైకి తెచ్చి తద్వారా సాంకేతికతను విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి తేనున్నాం. తద్వారా విద్యార్థులు దీన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఎడ్ టెక్ కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సొల్యూషన్స్ తయారీ, విద్యార్థుల నమోదు కార్యక్రమాలు చూస్తాయి. విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వసూలు చేస్తాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా ఆ కంపెనీలు మొత్తం సీట్లలో పేద విద్యార్థులకు 25 శాతం కేటాయించాల్సి ఉంటుంది’ అని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.