అంతా మేడమ్‌ దయ వల్లే..!

Hamid Ansari Mom Thank Sushma Swaraj - Sakshi

న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్‌ జైలులో శిక్ష అనుభవిస్తోన్న భారతీయుడు హమీద్‌ నిహాల్‌ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. భారత్‌ చెరుకున్న హమీద్‌ అనంతరం తన తల్లిదండ్రులతో పాటు వెళ్లి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు హామీద్‌. అనంతరం ‘‘మేరా భారత్‌ మహాన్‌’, ‘మేరా మేడమ్‌ మహాన్‌’. ఇదంతా మేడం వల్లే సాధ్యమయ్యిందం’టూ కన్నీళ్లతో హమీద్‌ తల్లి ఫౌజియా సుష్మా స్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హమీద్‌ ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్‌ మీదుగా పాక్‌ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించి పాక్‌ నిఘా సంస్థలు అరెస్ట్‌ చేశాయి.  2015లో పాక్‌ మిలటరీ కోర్టు అన్సారీపై కేసు విచారణ చేపట్టింది. ఫేక్‌ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్‌ జైలుకు తరలించారు.

2018 డిసెంబర్‌ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. హమీద్‌కు సంబంధించిన లీగల్‌ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్‌ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్‌ హైకోర్టు.. శిక్ష పూర్తయినా అన్సారీని జైళ్లో ఎందుకుంచారని పాక్‌ అడిషనల్‌ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.  స్వదేశానికి పంపాలని ఆదేశించింది. దీంతో హమీద్‌ను మంగళవారం మార్దాన్‌ జైలు నుంచి విడుదల చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top