ఆ ప్రచారం అవాస్తవం: సీఎం రూపానీ

Gujarat Shop Openings Not To Convenience Ramzan: CM Rupani - Sakshi

అహ్మదాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్నిగుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ తోసిపుచ్చారు. రంజాన్‌ పవిత్ర మాసాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా దుకాణాలు తెరవాలని చెప్పామే తప్పా, రంజాన్‌ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని కాదని వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని నీరుగార్చేందుకు కొన్ని శక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలతో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.

‘6.5 కోట్ల మంది గుజరాతీలను కాపాడటమే మా ముందున్న ధ్యేయం. కరోనా వైరస్ సంక్షోభం నుంచి వారిని బయటపడేలా చూడటం మా లక్ష్యం. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అన్న వివక్ష చూపడం లేదు. మొత్తం 6.5 కోట్ల గుజరాతీల కోసం పోరాడుతున్నామ’ని రూపానీ చెప్పుకొచ్చారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్‌ జోన్లలో ఎటువంటి దుకాణాలు తెరవడానికి అనుమతి లేదన్నారు. (కరోనా: పతంగులు ఎగరేయొద్దు)

హిందూ పండుగలైన శ్రీరామనవమి, చిత్ర నవమికి  లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించని ప్రభుత్వం రంజాన్‌కు మాత్రం సడలింపు ఇచ్చిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి రూపానీ స్పందించారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ నగరాల్లో మే 3 వరకు నిత్యవసర సరుకులు విక్రయించే దుకాణాలను  మినహాయించి ఏ దుకాణాలను తెరవడానికి అనుమతించలేదని గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం గుజరాత్‌లో ఇప్పటివరకు 3301 మంది కరోనా వైరస్‌ బారిన పడగా 151 మంది మృత్యువాత పడ్డారు. 313 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. 

చదవండి: కరోనా వైరస్‌.. మరో దుర్వార్త 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top