గాంధీ, నెహ్రూల ఖాతాలున్న బ్యాంక్‌కే కన్నం.. 

great history having punjab national bank, nirav modi scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎంతో ఘన చరిత్ర కలిగిన ‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌’ పరువు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కారణంగా నేడు నీట మునిగింది. దాదాపు 123 ఏళ్ల క్రితం, అంటే భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే 1895లో పాకిస్థాన్‌లోని లాహోర్‌ కేంద్రంగా ఈ బ్యాంక్‌ ఆవిర్భవించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు లాలా లజ్‌పతి రాయ్‌ ఈ బ్యాంకును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్యసమాజ్‌ సభ్యుడైన ఓ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ‘ఇండియన్‌ మనీ, ఇండియన్‌ మెన్‌’ అనే నినాదంతో ఈ బ్యాంకు ఏర్పాటుకు రాయ్‌ కృషి చేశారు. 

1894, మే నెలలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక బాడీ ఏర్పాటయింది. అప్పటికీ పంజాబ్‌ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన లాలా హరికిషన్‌ లాల్, ‘ది ట్రిబ్యున్‌’ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపక సభ్యుడు దయాల్‌ సింగ్‌ మజీతియాలు ఆ బాడీలో ఉన్నారు. రెండు లక్షల రూపాయల పెట్టుబడి, 20 వేల రూపాయల మూలధనం పెట్టుబడితో 1895లో బ్యాంక్‌ మొదటి బ్రాంచి ప్రారంభమైంది. బ్యాంకులో తొలి ఖాతాను లాలా లజ్‌పతి రాయ్‌ తెరిచారు. 

ఆ తర్వాత భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ, జాతిపిత మహాత్మా గాంధీలు కూడా ఇందులో ఖాతాదారులయ్యారు. అనతి కాలంలోనే ఈ బ్యాంకు అనేక బ్రాంచీలుగా విస్తరించినప్పటికీ 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఈ బ్యాంకు కూడా దిబ్బతిన్నది. ఏకంగా 92 బ్రాంచీలను మూసుకోవాల్సి వచ్చింది. దేశ విభజనకు కొన్ని నెలల ముందు బ్యాంక్‌ తన ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్‌లోని లాహోర్‌ నుంచి న్యూఢిల్లీకి మార్చుకుంది. దేశ విభజన సందర్భంగా మొత్తం డిపాజిట్లలో 40 శాతం డిపాజిట్లను కోల్పోవాల్సి వచ్చింది. బ్యాంకును ఏర్పాటు చేసిన తొలి 60 ఏళ్ల కాలంలోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ దేశవ్యాప్తంగా 270 బ్రాంచీలను ఏర్పాటు చేయగలిగింది. 1950, 1960 దశకంలో భారత్‌ బ్యాంక్, ఇండో కమర్షియల్‌ బ్యాంకులను కలుపుకొని మరింత బలపడింది. 

1969లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ బ్యాంక్‌తోపాటు దేశంలోని మరో 13 బ్యాంకులను జాతీయం చేశారు. అప్పటికే బ్యాంక్‌ 70 శాతం భారత ఖాతాదారుల డిపాజిట్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా ఏడువేల బ్రాంచ్‌లున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వం కంపెనీల్లో ఒకటిగా ఫోర్బ్స్‌ జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. 2010 నుంచి 2015 మధ్య పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌తోపాటు దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకులు తీవ్రంగా నష్టపోయాయి. అవినీతికి అలవాటుపడిన అధికారులు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడంతో వడ్డీలు పడిపోయి నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. 

దీన్ని అరికట్టడం కోసమే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ 2015, డిసెంబర్‌ నెలలో కఠిన నియమ, నిబంధనలను ప్రకటించింది. 2016 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ బ్యాంక్‌ నిరర్థక ఆస్తులు 55,800 కోట్ల రూపాయలకు చేరుకుంది. పైగా అదే సంవత్సరానికి 3,974 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భారతీయ బ్యాంకుల చరిత్రలోనే ఇంతటి నష్టం ఏర్పడడం ఇదే మొదటిసారి. 2017 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌కు చెందిన 9వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేశారు. 2018, మార్చి నెల నాటికి 5,473 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకు కోలుకుంటుందని భావిస్తున్న సమయంలో నీరవ్‌ మోదీ కుంభకోణం వెలుగుచూసింది. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top