ఐఐటీల్లో అమ్మాయిలు అంతంతే! 

Girls in IITs is too less - Sakshi

దేశంలోని 3,000 విద్యాసంస్థల నుంచి ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వారిలో యువతులు 30 శాతం మంది మాత్రమే. అడ్వాన్స్‌డ్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) కోచింగ్‌ క్లాసుల తాలూకూ ప్రకటనల్లో అమ్మాయిల ఫొటోలు దాదాపుగా కనిపించని పరిస్థితి. ఐఐటీల్లో పరిస్థితి మరింత అన్యాయం. ఈ ఏడాది 23 ఐఐటీల్లో మొత్తం 38,705 మంది అభ్యర్థులు ప్రవేశార్హత సాధించగా అందులో బాలికలు 5,356 (13.8 శాతం) మంది మాత్రమే. అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచిన షబ్నమ్‌ సహాయ్‌ 10వ ర్యాంకు సాధించింది. 2018లో టాప్‌ 500 మంది అభ్యర్థుల్లో అమ్మాయిల సంఖ్య 23 మించలేదు. ఉన్నత విద్యారంగంలో చోటుచేసుకున్న లింగ వివక్షకు ఇదొక ప్రబల ఉదాహరణ. బాలికలపట్ల సమాజ ధోరణులే ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు శాస్త్ర సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోశ్‌ శర్మ. కుటుంబం అబ్బాయిలను ప్రోత్సహిస్తోంది. వారు మరో ఆలోచన లేకుండా తమ ఐఐటీ కలలను సాకారం చేసుకోగలుగుతున్నారు.

అమ్మాయిలకు సమర్థత ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువవుతోంది. ‘నా కూతురు భద్రంగా ఉంటుందా? ఇంటికి దూరంగా మనగలుగుతుందా? కోర్సు డిమాండ్‌ చేసిన విధంగా చదువు సాగించేందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా?’ వంటి ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి. వారిని ఆందోళనకు లోను చేస్తున్నాయి. ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే విద్యార్థులు గట్టి కోచింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అదొక ఖరీదైన వ్యవహారం. ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అమ్మాయిల విషయంలో ఖర్చు పెట్టేందుకు సిద్ధ్దపడని దుస్థితి. పైగా రవాణా సౌకర్యం, హాస్టల్‌లో ఉండాల్సి రావడం గురించి నానారకాల భయాలు. ఈ పరిస్థితుల్లో అమ్మాయిల్ని స్థానిక కళాశాలల్లో చేర్చడం ఉత్తమమని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు కాన్పూర్‌లో పార్ధా కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న మనీష్‌ సింగ్‌ చెబుతున్నారు. ఈ ఏడాది ఆయన 1,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వారిలో 10 శాతం మంది మాత్రమే బాలికలు.

వారెవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. సీటు లభించాలేగానీ అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించగలుగుతున్నారంటారు ఐఐటీ ఢిల్లీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుమీత్‌ అగర్వాల్‌. ప్రవేశపరీక్ష బాలికలకు ఒకింత అవరోధంగా ఉందని ఆయన చెబుతున్నారు. ఐఐటీల్లో లింగ నిష్పత్తి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతేడాది ఐఐటీ కౌన్సిల్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన బాలికలకు అదనంగా సీట్లు కేటాయించింది. దీంతో వారి శాతం 8 నుంచి 16కి పెరిగింది. ఐఐటీ ఢిల్లీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో 2016లో 70 మంది బాలికలు చేరగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 190కి పెరిగిందని అగర్వాల్‌ తెలిపారు. ఐఐటీలు లింగ సమతౌల్యత పాటించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి విశదపరుస్తోంది. లేకుంటే జనాభాలో 50 శాతం మంది ప్రతిభా సామర్థ్యాలను మనం కోల్పోతామంటున్నారు అగర్వాల్‌. మెరుగైన సమాజం కోసం సాంకేతికతను వాడుకోవాలని భావిస్తున్న మనం.. ఇందులో అన్ని తరగతుల ప్రజలను భాగస్వాముల్ని చేయాల్సి ఉందని అగర్వాల్‌ వంటి మేధావులు సూచిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top