బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్‌!

Financial Action Task Force to be given dossier to blacklist Pakistan - Sakshi

ఎఫ్‌ఏటీఎఫ్‌కు కీలక పత్రాలివ్వనున్న భారత్‌

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఎఫ్‌ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్‌ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్‌ ఎండగట్టనుంది.

ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్‌లో జరిగే సమావేశంలో పాకిస్తాన్‌ను నిషేధిత జాబితా(బ్లాక్‌ లిస్ట్‌)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్‌తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్‌ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్‌ను డౌన్‌గ్రేడింగ్‌ చేస్తాయి.

దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్‌అండ్‌పీ, ఫిచ్, మూడీస్‌ వంటి రేటింగ్‌ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్‌ రేటింగ్‌లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్‌ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్‌ దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్‌ నిషేధిత జాబితాలో చేర్చింది.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top