అమానుషం.. కలెక్టర్‌ కాళ్లపై పడ్డ రైతన్న!

Farmer breaks down in front of Collector In Madyapradesh - Sakshi

భోపాల్‌ : ప్రభుత్వం మారింది.. ముఖ్యమంత్రి మారాడు.. కానీ ఆ రైతన్న సమస్య మాత్రం తీరలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ఆ రైతన్న తన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో చేసేదేమిలేక చివరకు కలెక్టర్‌ కాళ్లపై పడి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో ప్రతిఒక్కరి మనస్సును కదిలిస్తోంది. దేశానికి వ్యవసాయం వెన్నముక అని ప్రగాల్భాలు పలికే నేతలు.. వాటిని కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం చేస్తున్నారు. నాయకుల అలక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యంతో అందరికి తిండి పెట్టే రైతన్న.. ఆ బుక్కెడు బువ్వ కోసం అధికారుల కాళ్లుపట్టుకుంటున్నాడు.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన మరోసారి రైతుల దయనీయ స్థితిని చాటిచెప్పింది. రనౌద్‌ గ్రామానికి చెందిన అజిత్‌ అనే రైతు తన సమస్యను చెప్పుకొవడానికి శివపురి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. కానీ ఆ కలెక్టర్‌ అతన్ని పట్టించుకోకుండా ముఖం చాటేయడంతో చేసేదేమిలేక కాళ్లపై పడి బోరుమన్నాడు. అయినా పట్టించుకోని కలెక్టరమ్మ  కారులో కూర్చున్న అనంతరం ఆ రైతును పిలిచి అతని సమస్యపై ఆరా తీశారు. దీంతో అజిత్‌.. ‘గత ఆర్నేళ్లుగా నా పోలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని కరెంట్‌ ఆఫీసర్లు చుట్టు తిరుగుతున్నాను సర్‌.. సూపర్‌వైజర్‌ సార్‌కు రూ.40 వేలు కూడా ఇచ్చాను. అయినా ఇప్పటి వరకు ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టలేదు. ఈ రశీదు మీరే చూడండి సార్‌. చేతికొచ్చే దశలో నా పంటంతా నాశనమవుతోంది. వాళ్లొచ్చి ట్రాన్స్‌ఫార్మర్‌ పెడితే కానీ నా పంట నా చేతికి రాదు’  అని కన్నీటి పర్యంతమయ్యాడు. అయినా పట్టించుకోని కలెక్టరమ్మ ఆ సంగతేందో చూడండి అనేసి కారు విండో మూసుకుని వెళ్లిపోయింది.

ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కనిపించే నేతలు ఇలాంటి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు చొరవ చూపరని, అప్పుడు మాత్రం వద్దన్నా వచ్చి ఏదో చేస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తుంటారని మండిపడుతున్నారు. అందరికి అన్నం పెట్టే రైతన్న ఇలా కాళ్లపై పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ రైతు సమస్యను తీర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.  సీఎంగా బాధ్యతలు చేపట్టిన కమల్‌నాథ్‌.. రెండు లక్షల రుణమాఫీ ఫైలుపైనే తన తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top