కశ్మీర్‌ మరో సిరియా కాకూడదు! | Do not Want Kashmir to be Syria, Says EU Delegation | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ మరో సిరియా కాకూడదు!

Oct 30 2019 2:43 PM | Updated on Oct 30 2019 4:08 PM

Do not Want Kashmir to be Syria, Says EU Delegation - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు సభ్యులు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. రేపటి (అక్టోబర్‌ 31)తో జమ్మూకశ్మీర్‌ విభజన అధికారికంగా అమల్లోకి రానుంది. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రం విడిపోనుంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్‌లో పర్యటించేందుకు అనుమతించడం పలు విమర్శలకు కారణమవుతోంది. దేశ రాజకీయ నాయకులే కశ్మీర్‌ వెళ్లేందుకు అనుమతించడం లేదు. మరి ఈయూ బృందాన్ని ఎలా పంపారని పలువురు రాజకీయ పరిశీకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈయూ ప్రతినిధుల బృందం బుధవారం మీడియాతో మాట్లాడింది. ప్రపంచమంతాటా నెలకొన్న ఉగ్రవాదంపై ఈయూ ఆందోళనతో ఉందని, కశ్మీర్‌ సమస్యను అర్థంచేసుకోవడానికే తాము వచ్చామని ఈయూ సభ్యులు తెలిపారు. ‘కశ్మీర్‌లో శాంతిస్థాపన, ఉగ్రవాద నిర్మూలన కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అంతర్జాతీయ ప్రతినిధులుగా మేం పూర్తి మద్దతు తెలుపుతున్నాం. చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు భారత్‌ ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని ఓ ఈయూ ఎంపీ అభిప్రాయపడగా.. మరో ఎంపీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదం ఒక ప్రాంతాన్ని, దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో నేను ప్రత్యక్షంగా చూశాను. గతంలో నేను సిరియాలో పర్యటించాను. ఉగ్రవాదం కారణంగా చోటుచేసుకున్న విధ్వంసాన్ని చూశాను. అలాంటి పరిస్థితి కశ్మీర్‌లో రాకూడదని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈయూ ఎంపీ నికోలస్‌ ఫెస్ట్‌ మాత్రం తమను కశ్మీర్‌లోకి అనుమతించి.. భారత రాజకీయ నాయకులను అనుమతించకపోవడం మంచిది కాదని, వారిని కూడా అనుమతించి.. ఈ అసమతుల్య వాతావరణాన్ని సరిచేయాలని కోరారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దుచేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆందోళనలు, అల్లర్లు చెలరేగకుండా కశ్మీర్‌లో పెద్ద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు క్రమంగా ఎత్తివేసిన నేపథ్యంలో తాజాగా తొలిసారి ఈయూ పార్లమెంటు సభ్యుల విదేశీ బృందం కశ్మీర్‌లో పర్యటించేందుకు కేం‍ద్రం అనుమతించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement