పార్టీ బలోపేతం లక్ష్యంగా సిద్ధం చేయాల్సిన కార్యాచరణపై డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. పార్టీలో ప్రక్షాళన లక్ష్యంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది.
సాక్షి, చెన్నై: పార్టీ బలోపేతం లక్ష్యంగా సిద్ధం చేయాల్సిన కార్యాచరణపై డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. పార్టీలో ప్రక్షాళన లక్ష్యంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. ఇందులో ఆరుగురికి చోటు కల్పించింది. ఇక, తన వ్యూహాలకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి పదును పెట్టే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం డీఎంకేను వెంటాడుతోంది. వరుస ఓటములతో డీఎంకే శ్రేణులు డీలా పడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఆ పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. ఓటమికి కారణాలెన్ని ఉన్నా, రానున్న రోజుల్లో పార్టీలో సరికొత్త మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఉన్నారు.
ఎన్నికల్లో అనేక జిల్లాల నేతలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని పరిగణనలోకి తీసుకుని అక్కడి నేతలను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం జిల్లా స్థాయిలో కమిటీలను రద్దు చేసి, సరి కొత్తగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు, కార్పొరేషన్ల స్థాయిలో కమిటీల ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఈ కమిటీల ద్వారా ఆయా అసెంబ్లీ, లోక్ సభ, కార్పొరేషన్ల పరిధుల్లోని కుగ్రామాలు, పంచాయతీలు, వార్డుల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కింది స్థాయి నుంచి పార్టీలో సమూల మార్పులకు నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల రెండో తేదీన రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ పై అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆరుగురితో కమిటీ: ఉన్నత స్థాయిసమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీలో సమూల మార్పు, సరికొత్త తరహాలో కమిటీల ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం డీఎంకే అధిష్టానం చేసింది. అయితే, ఎలాంటి పద్ధతిలో సమూల మార్పు, సరికొత్త తరహా అంశాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమావేశంలో తీసుకున్న మార్పు నిర్ణయాలు, సరికొత్త అంశాల గురించి జిల్లాల వారీగా చర్చించి పార్టీ బలోపేతానికి ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. తన వ్యూహాల అమలు లక్ష్యంగా, వాటికి పదును పెట్టడంతో పాటుగా సరికొత్తగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ కమిటీని కరుణానిధి గురువారం ప్రకటించారు.
ఈ కమిటీలో పార్టీ నేతలు తిరు వెంగడం, టీఎస్ కల్యాణ సుందరం, రాజమాణిక్యం, తంగం తెన్నరసు(ఎమ్మెల్యే), కేఎస్ రాధాకృష్ణన్, సచ్చిదానందన్‌కు చోటు కల్పించారు. ఈ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించ నున్నది. ఎక్కడక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదో పరిశీలించి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీయనుంది. అన్ని ప్రాంతాల్లో పార్టీల ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు సేకరించనుంది. పూర్తి స్థాయిలో పరిశీలన ప్రక్రియను ముగించినానంతరం నివేదికను పార్టీ అధిష్టానానికి ఈ కమిటీ సమర్పించనుంది.