ఏకమొత్తం(బల్క్)లో డీజిల్ కొనేవారికి రాయితీ ధర వర్తించదని, మార్కెట్ ధరకు కొనాల్సిందేనని 11 నెలల క్రితం విధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే యోచనలో ఉంది.
న్యూఢిల్లీ, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏకమొత్తం(బల్క్)లో డీజిల్ కొనేవారికి రాయితీ ధర వర్తించదని, మార్కెట్ ధరకు కొనాల్సిందేనని 11 నెలల క్రితం విధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే యోచనలో ఉంది. ఈ దిశగా చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొం దించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం రాయితీ ధర కంటే మార్కెట్ ధర లీటరుకు కనీసం రూ. 10-11 ఎక్కువ ఉన్న విషయం విదితమే. దానిపై వ్యాట్‌తో అది రూ. 12-14 అవుతోంది. కాబట్టి డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేస్తే ఆర్టీసీకి ఏటా దాదాపు రూ. 700 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.
ఆ భారం మీదపడకుండా ఆర్టీసీ.. తన వినియోగంలో 90 శాతం డీజిల్‌ను పెట్రోల్ బంకుల్లో చిల్లరగా కొనుగోలు చేస్తోంది. దీని వల్ల పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు లబ్ధి చేకూరడం తప్ప ప్రభుత్వానికి వస్తున్న అదనపు ఆదాయం ఏమీ లేదు. డీజిల్ రాయితీ ధర, మార్కెట్‌ధర(బల్క్ కొనుగోలుదారులకు) మధ్య వ్యత్యాసం లేనప్పుడు.. రాష్ట్రంలోని మొత్తం డీజిల్ వినియోగంలో బల్క్ కొనుగోలు వాటా 20 శాతంగా ఉండేది. కొత్త విధానం ప్రవేశ పెట్టిన తర్వాత అది 4 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే తీరు కనబడుతోంది. ఈ నేపథ్యంలో.. తన నిర్ణయాన్ని కేంద్ర వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది.