‘డిగ్గి.. యూపీలో తెలుగు మాట్లాడతారా..?’

Digvijaya Singh Roasted Again Tweeting 108 Vehicle Photo - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయం అయితే చాలు.. అది నిజమో కాదో తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం.. ఆనక అది కాస్తా తప్పుడు సమాచారం అని తెలడంతో విమర్శల పాలవ్వడం పరిపాటి అయ్యింది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌కి. తాజాగా మరోసారి నెటిజన్ల చేతిలో విమర్శల పాలవుతున్నారు దిగ్విజయ్‌ సింగ్‌. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం కాస్తా రివర్సవ్వడంతో తలపట్టుకున్నారు డిగ్గి రాజా.

విషయం ఏంటంటే దిగ్విజయ్‌ సింగ్‌ తన ట్విటర్‌లో నిరుపయోగంగా పడి ఉండి శిథిలావస్థకు చేరుకున్న 108 వాహనాల ఫోటోను షేర్‌ చేశారు. ఫోటోతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశిస్తూ ‘యోగి జీ.. మీరు ఉత్తరప్రదేశ్‌కు ఏం చేశారు..? అఖిలేశ్‌ యాదవ్‌ హాయాంలో ప్రారంభించిన 108, 102 వాహనాలను మీరు ఇలా నిరుపయోగం చేసి దుమ్ము కొట్టుకుపోయే స్థితికి తీసుకోచ్చారు. ప్రజల ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనా’ అంటూ ట్వీట్‌ చేశారు.

కానీ అసలు విషయం ఏంటంటే ఈ అంబులెన్స్‌లు ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవి. తొలుత రజత్‌ యాదవ్‌ అనే వ్యక్తి షేర్‌ చేసిన ఈ ఫోటోను కాస్తా దిగ్విజయ్‌ సింగ్‌ కాపీ చేసి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని ఆయనే నవ్వుల పాలయ్యారు. దిగ్విజయ్‌ ట్వీట్‌ చేసిన ఫోటో చూసిన నెటిజన్లు ‘ఉత్తరప్రదేశ్‌లో తెలుగు మాట్లాడతారా డిగ్గి’ అంటూ కామెంట్‌ చేశారు. అంతేకాకా ‘దిగ్విజయ్‌ ఒక అబద్దాల కోరు’ అంటూ విమర్శిస్తున్నారు.

గతంలో కూడా దిగ్విజయ్‌ సింగ్‌ పగుళ్లు వచ్చిన ఓ మెట్రో పిల్లర్‌ ఫోటోను షేర్‌ చేస్తూ ‘భోపాల్‌ రైల్వే బ్రిడ్జి పరిస్థితి ఇది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆనక అది కాస్తా పాకిస్తాన్‌కు చెందిన మెట్రో పిల్లర్‌గా తెలడంతో తన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top