సీఎం సమక్షంలో నన్ను కొట్టారు

Delhi CS Anushu Prakash about attck - Sakshi

ఆప్‌ ఎమ్మెల్యేలు దాడి చేశారు: ఢిల్లీ సీఎస్‌ అన్షు ప్రకాశ్‌

ప్రచార ప్రకటనలు విడుదల చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపణ

నిరాధార నిందలు.. రేషన్‌ సరుకుల గురించే ఆయనను పిలిచాం: ఆప్‌

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వద్ద ఐఏఎస్‌ సంఘాల నిరసన  

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యేలు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అన్షు ప్రకాశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యాలయం ఖండించింది. ఆధారాల్లేకుండానే తమ ఎమ్మెల్యేలపై విపరీత నిందలు వేస్తున్నారని పేర్కొంది. మరోవైపు మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

అసలేం జరిగింది?
సీఎస్‌ అన్షు ప్రకాశ్‌ దాడిపై ఢిల్లీ ఉత్తర డీసీపీకి ఫిర్యాదు చేశారు. ‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు నాకు ఫోన్‌ చేసి అర్ధరాత్రి సీఎం నివాసంలో సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. ఆప్‌ ప్రభుత్వ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రచార కార్యక్రమాలు, ప్రకటనల గురించి మాట్లాడేందుకు ఆ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నేను సీఎం నివాసానికి వెళ్లేటప్పటికి అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

నేను వెళ్లాక తలుపులు మూసి నన్ను ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మరో ఎమ్మెల్యే మధ్య కూర్చోబెట్టారు. ప్రచార ప్రకటనల విడుదలకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందిగా సీఎం నన్ను ఆదేశించారు. నేను నిరాకరించడంతో నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని ఎమ్మెల్యేలు బెదిరించారు. నాకు ఇరువైపులా కూర్చున్న ఎమ్మెల్యేలు అకారణంగా నా తలపై కొట్టారు.

నా కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. నేను ఎలాగోలా అక్కడ నుంచి బయటపడగలిగాను’ అని సీఎస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ ముందుగానే కుట్ర పన్ని, పక్కా ప్రణాళికతో తనపై దాడి చేశారనీ, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలసి ఈ విషయం ఆయనకు చెప్పానన్నారు.

ఖండించిన ఆప్‌..
మరోవైపు సీఎస్‌పై దాడి ఆరోపణలను ఆప్‌ ఖండించింది. తమ ప్రభుత్వంపై నిరాధారమైన, విపరీత నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో రేషన్‌ సరుకులు సరిగ్గా అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో దానిపై మాట్లాడేందుకే సీఎస్‌ను పిలిచామంది. ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు ఆయనను పిలిచామనడం అబద్ధమని ఆప్‌ అంటోంది.

ఎమ్మెల్యే అజయ్‌ దత్‌ సీఎస్‌పై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తూ అన్షు తనను, మరో ఎమ్మెల్యేను కులం పేరుతో దూషించారన్నారు. తన నియోజకవర్గంలో రేషన్‌ సరుకులు సరిగా అందడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించగా.. సీఎస్‌ తనతో పాటు మరో ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ను తిడుతూ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారని అజయ్‌ పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేలకు, సీఎంకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మాత్రమే తాను జవాబుదారీనంటూ సీఎస్‌ అన్నారని అజయ్‌ ఆరోపించారు.  

కేజ్రీవాల్‌ ఓ పట్టణ నక్సలైట్‌: బీజేపీ
ఆప్‌ ఎమ్మెల్యేలు గూండాలనీ, కేజ్రీవాల్‌ ఓ పట్టణ నక్సలైట్‌ అని బీజీపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను పట్టణ నక్సలైట్‌గా పేర్కొన్న తివారీ, ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫల మై దాదాగిరికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఢిల్లీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ అన్నారు. సీఎస్‌పై దాడికి కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలన్నారు.

ఐఏఎస్‌ల నిరసనలు
ఈ ఘటనపై ఐఏఎస్‌ల ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. సంఘాల నాయకులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందనీ, ప్రభుత్వోద్యోగులు గౌరవంగా, నిర్భయంగా పని చేసుకునే వాతావరణం ఉండాలని రాజ్‌నాథ్‌ అన్నారు.

మరోవైపు మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించగా దాదాపు వంద మంది ఉద్యోగులు ఆయనను ఘెరావ్‌ చేశారు. హుస్సేన్‌ వ్యక్తిగత సహాయకుడిని కొట్టారు. ఇందుకు సంబంధించి మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎస్‌తోపాటు మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్‌ల ఫిర్యాదులపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమో దు చేశామని పోలీసులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top