నిర్భయ దోషులకు నేడే ఉరి

Delhi Court Rejects on Nirbhaya Convicts Petitions - Sakshi

ఉదయం 5.30 గంటలకు శిక్ష అమలు

దోషుల పిటిషన్ల కొట్టివేత

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్‌ కుమార్, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది.

ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పటియాలా హౌస్‌ కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్‌ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్‌ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్‌ వేసినట్లు తెలిపింది.

నిర్భయ తల్లి వ్యాఖ్య
తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు.  దోషి అక్షయ్‌ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్‌ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్‌. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్‌(32), పవన్‌(25), వినయ్‌(26), అక్షయ్‌(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top