
జైపూర్/భోపాల్: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును నిరసిస్తూ సోమవారం జరిగిన హింసలో మృతుల సంఖ్య 11కు చేరింది. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు మంగళవారం రాజస్తాన్‌లో హింస చోటుచేసుకుంది. కరౌలి జిల్లాలోని హిందౌన్ పట్టణంలో దాదాపు 5 వేల మంది ఆందోళనకారులు దళిత వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమారి జాతవ్, మాజీ ఎమ్మెల్యే భరోసిలాల్ జాతవ్‌ల ఇంటికి నిప్పంటించారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు.
తీర్పుతో మాకు సంబంధం లేదు: కేంద్రం
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో మార్పులతో తమకు సంబంధం లేదని, వెనకబడిన వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు పూర్తి నిబద్ధతతో ఉన్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత్ బంద్ హింసపై లోక్‌సభలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేస్తూ.. ‘ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదు. మేం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని అధ్యయనం చేసి.. మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం’ అని చెప్పారు.
చట్టాన్ని బలహీనపర్చే కుట్ర: కాంగ్రెస్
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలహీనపర్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ప్రజల్ని మోసగించేందుకు కేంద్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో కేంద్ర ప్రభుత్వం కక్షిదారుగా ఉందని, అదనపు సొలిసిటర్ జనరల్ కేంద్రం తరఫున వాదించారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు.