రాఫెల్‌ వివాదం: రిలయన్స్‌ ఎంపికపై దసాల్ట్‌ వివరణ

Dassault Says Freely Chose Reliance Defence In Rafale Deal - Sakshi

న్యూఢిల్లీ : రాఫెల్‌ ఒప్పందాన్ని సొంతం చేసుకునేందుకే రిలయన్స్‌ డిఫెన్స్‌ను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్‌ ఏవియేషన్‌ గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌కు చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నామని, 2017, ఫిబ్రవరి 10న దసాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డీఆర్‌ఏఎల్) జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటైందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య 2016 సెప్టెంబర్‌లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగానే దసాల్ట్‌ ఏవియేషన్‌ భారత్‌కు 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను విక్రయించిందని ప్రకటన పునరుద్ఘాటించింది. బీటీఎస్‌ఎల్‌, కైనెటిక్‌, మహింద్రా, మైని, శాంటెల్‌ వంటి వంద సంస్ధలతో వ్యాపార భాగస్వామ్యాలు కుదర్చుకున్నామని కూడా దసాల్ట్‌ వివరించింది.

రాఫెల్‌ యుద్ధ విమానాల కాంట్రాక్టును దక్కించుకునేందుకు అనివార్యంగానే రిలయన్స్‌ డిఫెన్స్‌తో డీల్‌కు సంస్థ సంతకం చేసిందని కంపెనీ అంతర్గత నివేదిక పేర్కొందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ దసాల్ట్‌ ఏవియేషన్‌ తాజా వివరణతో ముందుకొచ్చింది. రూ 60,000 కోట్ల రాఫెల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ చేసిన ప్రకటనతో పెనువివాదంలో కూరుకుపోయింది. భారత్‌ ఒత్తిడి మేరకే రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఒప్పందంలో భాగస్వామిగా చేర్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top