వైరల్‌ : మానవత్వం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్‌..!

CRPF Jawan Who Survived Pulwama Terror Feeds A Boy While On Duty - Sakshi

శ్రీనగర్‌ : పక్షవాతంతో బాదపడుతున్న ఓ బాలుడి పట్ల పుల్వామా ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇక్బాల్‌ సింగ్‌ అనే జవాన్‌ ఔదార్యం చాటాడు. అతనికి తన లంచ్‌ బాక్స్‌ ఇవ్వడంతో పాటు స్వయంగా ఆహారం తినిపించాడు. శ్రీనగర్‌లోని నవాకాదల్‌ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్‌కు స్థానికంగా నివాసముంటున్న ఓ పిల్లాడు తారసపడ్డాడు. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్‌ తన లంచ్‌ బాక్స్‌ ఇచ్చాడు. అయితే, సదరు బాలుడి రెండు చేతుల్లో చలనం లేదని తెలియడంతో .. తనే దగ్గరుండి తినిపించాడు. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్‌ అయింది. 

సోల్జర్‌ మంచితనంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్బాల్‌ ఔదార్యం మెచ్చి ‘హ్యూమన్‌ అండ్‌ సెల్ఫ్‌లెస్‌ యాక్ట్‌’ సర్టిఫికేట్‌ కూడా అందించామని సీఆర్పీఎఫ్‌ తెలిపింది. వీరత్వం, కరుణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు అని పేర్కొంది. జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే కాన్వాయ్‌లోని ఓ వాహనానికి ఇక్బాల్‌  డ్రైవర్‌గా ఉన్నారు. క్షతగాత్రులైన సహచరులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆయన వారి ప్రాణాలు కాపాడారు.


ఔదార్యం చాటుకున్న  ‘పుల్వామా’ జవాన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top