మరణించి కూడా ఊరిలో వెలుగులు నింపిన జవాను

CRPF jawan Pankaj Kumar Tripathis Village development started - Sakshi

మహరాజ్‌గంజ్‌, యూపీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాను పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి వెలుగులు తెప్పించాడు. బతికున్నప్పుడు దేశ సేవ కోసం పని చేసి, మరణించిన తర్వాత కూడా తన ఊరి కష్టాలను తీర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌-నేపాల్‌ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహరాజ్‌గంజ్‌లో ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉండేది. 

పంకజ్‌ కుమార్‌ ఊరిలో ప్రాథమిక పాఠశాల కూడా ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది. పాఠశాలనుబాగుచేయాలని ఊరిపెద్దలు ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నారు. పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి వీరమరణంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటూ ఉన్నతాధికారులు ఆ ఊరికి రావడంతో, ఒక్కసారిగా ఆ ఊరిపై అధికారుల దృష్టిపడింది. పాఠశాల పునర్నిర్మాణపనులు చకచకా ప్రారంభమయ్యాయి. పాఠశాల పేరును కూడా పంకజ్‌ త్రిపాఠి పేరుగా మార్చారు. అంతేకాకుండా ఊర్లో అధ్వాహ్నంగా ఉన్న రోడ్లకు సంబంధించి మరమత్తు పనులను పూర్తి చేశారు. ఆదిత్యనాథ్‌  ఆదివారం పంకజ్‌కుమార్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. పంకజ్‌చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ ఊర్లో పరిస్థితులను గమనించిన ఆదిత్యనాథ్‌ వారికి ప్రభుత్వం తరపున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు.

రెండు నెలల 17 రోజుల సెలవు అనంతరం ఫిబ్రవరి 10న పంకజ్‌ కుమార్‌ త్రిపాఠి తిరిగి ఉద్యోగంలో చేరారు. పంకజ్‌ కుమార్‌, భార్య రోహిణి గర్భిణి. మరికొన్ని రోజుల్లో రాబోయే తమ రెండో సంతానం కోసం వీరిద్దరూ ఎన్నో కలలు కన్నారు. బిడ్డపుట్టగానే ఊర్లో అందరికి పెద్ద పార్టీ ఇస్తానని చెప్పేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పంకజ్‌ కుమార్‌ త్రిపాఠికి సంబంధించి కేవలం లైసెన్స్‌, పాన్‌ కార్డు మాత్రమే లభ్యమయ్యాయని, చివరి చూపుకూడా చూసుకోలేకపోయామని తండ్రి ఓం ప్రకాశ్‌ త్రిపాఠి కన్నీటిపర్యంతమయ్యారు.

'పంకజ్‌ చివరిసారిగా ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14న ఉదయం ఫోన్లో మాతో మాట్లాడాడు. శ్రీనగర్‌కు వెలుతున్నామని, సాయంత్రం వరకు అక్కడికి చేరుకుంటామని నాతో చెప్పాడు. ఉగ్రదాడికి సంబంధించిన వార్తలను రేడియోలో విన్న తర్వాత పంకజ్‌ ఫోన్‌కు ఎంత ట్రై చేసినా కలవలేదు. ఏ రోజు కూడా సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్‌ అవ్వమని నేను నా కుమారుడితో చెప్పలేదు. డబ్బు సంపాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చి మా కళ్ల ముందే ఉండేలా ఏదైనా పని చేసుకోమని మాత్రమే చెప్పేవాడిని' అని ఓం ప్రకాశ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. పంకజ్‌ కుమార్‌ 2012లో సీఎఆర్‌పీఎఫ్‌లో జాయిన్‌ అయ్యాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top