ఏప్రిల్‌లో మందిర నిర్మాణం!

Construction of Ram temple to begin on Ram Navami or Akshaya Tritiya - Sakshi

‘అయోధ్య’ ట్రస్ట్‌ సభ్యుడు దేవగిరి మహారాజ్‌ వెల్లడి

పుణే/న్యూఢిల్లీ/అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణం శ్రీరామ నవమి(ఏప్రిల్‌ 2) రోజు కానీ, అక్షయ తృతీయ(ఏప్రిల్‌ 26)రోజు కానీ ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యుడు స్వామి గోవింద దేవగిరి మహారాజ్‌ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్‌ను బుధవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రామమందిర నిర్మాణాన్ని కచ్చితంగా ఏ రోజున ప్రారంభిస్తామనేది త్వరలో జరగనున్న ట్రస్ట్‌ తొలి భేటీలో నిర్ణయిస్తామని దేవగిరి తెలిపారు. రెండేళ్లలో మందిరాన్ని పూర్తి చేస్తామన్నారు.

తొలి విరాళం రూపాయి  
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా ట్రస్ట్‌కు అందజేసింది. కేంద్రం తరఫున హోంశాఖలో అండర్‌ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము బుధవారం ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్‌కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్‌కు విరాళాలు అందజేయవచ్చని అధికారులు తెలిపారు. ట్రస్ట్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్‌ కైలాశ్‌ ప్రాంతంలోని సీనియర్‌ న్యాయవాది, ట్రస్ట్‌ సభ్యుడు పరాశరన్‌ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

మసీదుకు ఇచ్చిన స్థలం చాలా దూరంగా ఉంది
మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌కు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన స్థలం అయోధ్యకు 25 కి.మీ.ల దూరంలో రోడ్డు కూడా సరిగాలేని ఓ గ్రామంలో ఉందని ‘అయోధ్య’ వివాదంలోని ముస్లిం పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఇప్పుడు కేటాయించిన ప్రదేశంచాలా దూరంలో ఉంది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాస్పద స్థలం ఉన్న 67 ఎకరాల్లోనే మందిరం, మసీదు ఉండాలని 1994లో ఇస్మాయిల్‌ ఫరుఖి కేసులో సుప్రీం తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top