మోదీ పాలనలో ఇళ్ల నిర్మాణం

Consruction Of Houses In Narendra Modis Ruling - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశంలోని పేదల సొంతింటి కళను సాకారం చేసేందుకు 2015, జూన్‌ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని ప్రకటించారు. భారత దేశం75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే 2022 సంవత్సరం నాటికి ప్రతి భారతీయుడికి ఇటుక, సిమ్మెంట్‌తో కట్టిన ఇల్లు, ఇంటికి నీళ్లు, విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యం సమకూర్చేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని మోదీ ప్రకటించారు. ఈ స్కీమ్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1.2 కోట్ల ఇళ్లకు ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తుందని తెలిపారు. 

ఈ స్కీమ్‌ కింద 2019, మార్చి నెల నాటికి గ్రామీణ ప్రాంతాల్లో కోటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని మోదీ లక్ష్యంగా నిర్దేషించారు. అయితే ఈ ఫిబ్రవరి 11వ తేదీ వరకు 69 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 31 శాతం లక్ష్యం పెండింగ్‌లో పడిపోయింది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. 1.2 కోట్ల ఇళ్లను నిర్మించడం లక్ష్యంకాగా, యాభై శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి గతంలోనే ప్రకటించారు. అయితే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు 68.5 లక్షల ఇళ్లు మంజూరయితే వాటిలో కేవలం 18 శాతం ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారు.
 
1980లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిర ఆవాస్‌ యోజన’ పథకాన్నే నరేంద్ర మోదీ పేరు మార్చి ‘ప్రధాని ఆవాస్‌ యోజన’గా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేదలకు సబ్సిడీ కింద 70 వేల రూపాయల నగదును ఆనాడు అందజేసేవారు. దాన్ని ప్రధాని మోదీ మైదాన ప్రాంతాల్లో ఇంటికి 1.2 లక్షల రూపాయలకు, కొండ ప్రాంతాల్లో 1.3 లక్షల రూపాయలకు పెంచారు. 2011 సెన్సన్‌ ప్రకారం వెనకబడిన కులాలు, సామాజిక, ఆర్థిక వెనకబాటు ప్రమాణాల ప్రాతిపదకన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులు అర్హులా, కాదా ? అంశాన్ని గ్రామ సభలు కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రతి లబ్ధిదారుడు తాను ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఇంటి ముందు నిలబడిన ఫొటోలను బ్లాక్‌ స్థాయి అధికారులు పంపించాల్సి ఉంటుంది.

భౌగోళిక పరిసరాలను తెలిపే విధంగా పక్కా ఇల్లు కట్టబోతున్న స్థలం ఫొటోను కూడా లబ్ధిదారుడి ఫొటోకు జత చేయాల్సి ఉంటుంది. పక్కా ఇంటి కోసం స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నింటిని పరిశీలించాక కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తోంది. ఇంటి సబ్సిడీని మూడు లేదా నాలుగు వాయిదాల్లో మంజూరు చేస్తోంది. ఇంటి అనుమతితోపాటు మొదటి విడతను ఆ తర్వాత ఇంటి నిర్మాణం పురుగతిని బట్టి మూడు లేదా నాలుగు వాయిదాల్లో మొత్తం సొమ్మును చెల్లిస్తుంది.

ఈ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016–17 ఆర్థిక సంవత్సరం కింద 34,050 కోట్ల రూపాయల కేటాయింపులు కావాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రం కేవలం 16.000 కోట్ల రూపాయలను మాత్రమే మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 69 లక్షల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా, వారిలో 31 లక్షల మందికి మాత్రమే నాలుగు వాయిదాల కింద మొత్తం సబ్సిడీ సొమ్ము ముట్టింది. మిగతా వారికి ఒకటి, రెండు వాయిదాలు మాత్రమే అందాయి. అప్పు తెచ్చి ఇళ్లు పూర్తి చేశామని వారు లబోదిబోమంటున్నారు. 

జాప్యానికి కారణాలేమిటీ ?
లబ్ధిదారుడికి పక్కా ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం లేకపోవడం ఓ సమస్య. అలాంటి వారికి ఉచితంగా ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేక పోవడం మరో సమస్య. అన్ని సవ్యంగా ఉన్న సందర్భాల్లో కేంద్రం వద్ద తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడం మరో సమస్య. ఈ సమస్య కారణంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం నత్త నడక నడుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top