
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పంద ఆడిట్ నుంచి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రాజీవ్ మహర్షి తప్పుకోవాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో ఆయన ఫ్రాన్స్‌తో జరిగిన చర్చల్లో పాల్గొన్నారని, ఆడిటింగ్‌లోనూ పాలుపంచుకుంటే పరస్పర విరుద్ధ ప్రయోజనమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. రఫేల్ ఒప్పందంపై కాగ్ రూపొందించిన నివేదికను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
రఫేల్ విమానాల కొనుగోలులో కేంద్రం జాతీయ ప్రయోజనాలపై రాజీ పడిందని, కానీ రాజ్యంగబద్ధ సంస్థ అయిన కాగ్ అన్ని రక్షణ ఒప్పందాలను నిష్పక్షపాతంగా ఆడిట్ చేయాలని రాజీవ్ మహర్షికి రాసిన లేఖలో పేర్కొంది. కాగ్‌కు తెలిసో తెలియకో రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వాటికి ఆయన కూడా బాధ్యుడేనని తెలిపింది. అసలు నిజాలు తెలిసి కూడా ఆయన ఆడిటింగ్‌లో పాల్గొనడం షాకింగ్‌కు గురిచేస్తోందని పేర్కొంది. రాజీవ్ మహర్షి 2014 అక్టోబర్ 24 నుంచి 2015 ఆగస్టు 30 మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ మధ్యకాలంలోనే(2015, ఏప్రిల్ 10న) ప్రధాని మోదీ పారిస్ వెళ్లి రఫేల్ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.