వెంకయ్యకు మరో 4 ప్రశ్నలు

వెంకయ్యకు మరో 4 ప్రశ్నలు - Sakshi


మోదీ, అమిత్‌ షా కూడా జవాబులు చెప్పాలి: కాంగ్రెస్‌

పాలకులు అనుమానాలకు అతీతంగా ఉండాలని వ్యాఖ్య



సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ:
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడిపై కాంగ్రెస్‌ విమర్శలను తీవ్రం చేసింది. అవినీతిపై వెంకయ్యకు తాము ఇటీవల వేసిన నాలుగు ప్రశ్నలకు ఆయన, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు అనుమానాలను నివృత్తి చేయకపోగా కొత్త ప్రశ్నలను లేవనెత్తాయంటూ బుధవారం మరో నాలుగు ప్రశ్నలను సంధించింది. వీటికి వెంకయ్యతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కూడా జవాబులు చెప్పాలని డిమాండ్‌ చేసింది. ‘దేశ ప్రజలు సమాధానాలు కోరుతున్నారు.. ప్రజాజీవితంలో పారదర్శకత, నిజాయితీ గురించి మాట్లాడే మోదీ.. పాలకులు అనుమానాలకు అతీతంగా ఉండాలన్న విషయాన్ని తెలుసుకోవాలి’అని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్‌ వేసిన తాజా ప్రశ్నలు..



వెంకయ్య కుమార్తె దీపా వెంకట్‌కు చెందిన స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌.. హైదరాబాద్‌ నగరాభివృద్ధి సంస్థకు చెల్లించాల్సిన రూ. 2.4 కోట్ల డెవలప్‌మెంట్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంగీకరించింది. మరో 16 ట్రస్టులకు కూడా మినహాయింపు ఇచ్చారంటూ వెంకయ్య దీన్ని సమర్థించుకున్నారు. అయితే వందలాది ఇతర ఎన్జీవోలకు కూడా ఇలాంటి మినహాయింపు ఎందుకు ఇవ్వలేదు? ‘ఫెరా’విచారణ ఎదుర్కొంటున్న సంస్థకు మినహాయింపు సరైందేనా?



  వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్‌కు చెందిన హర్ష టయోటా కంపెనీ నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలవకుండా 350 టయోటా వాహనాలను కొనుగోలు చేసింది. డీజీఎస్‌ అండ్‌ డీ(డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సప్లైస్‌ అండ్‌ డిస్పోజల్‌) నిర్ణయించిన ధరల ప్రకారం కొన్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే వీటిని కొన్న తర్వాత మరో 350 వాహనాలను టెండర్లు పిలిచి, విజేతగా నెగ్గిన రాధాకృష్ణ మోటార్స్‌ నుంచి కొన్నారు. ఈ రెండు లాట్‌ల వాహనాలను తొలిసారే టెండర్లతో ఎందుకు కొనలేదు?



బీజేపీ అధ్యక్షుడి హోదాలో సహజంగానే కుశభావు ఠాక్రే మెమోరియల్‌ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నానని వెంకయ్య అంగీకరించారు. ఈ ట్రస్ట్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భోపాల్‌లో వందల కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమిని కేటాయించింది. సుప్రీం కోర్టు ఈ కేటాయింపును రద్దు చేయడం, మొట్టికాయలు వేయడం నిజం కాదా?



ఆంధ్రప్రదేశ్‌లో పేదలకోసం ఉద్దేశించిన 4.95 ఎకరాల భూమిని తాను తీసుకున్న విషయాన్ని వెంకయ్య తోసిపుచ్చలేదు. తనకు అక్రమంగా కేటాయించిన ఈ భూమిని ఆయన బలవంతంగా తిరిగి ఇచ్చిన మాట నిజం కాదా? ఆ చర్యలతో ఆయన నిర్దోషిగా తేలినట్టా?



బురదజల్లుతున్నారు: వెంకయ్య

కాంగ్రెస్‌ ప్రశ్నలకు తాను సమాధానాలిచ్చినా ఆ పార్టీ తనపై బురదజల్లుడు ప్రచారాన్ని కొనసాగిస్తోందని వెంకయ్య నాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాత ఆరోపణలనే మళ్లీ లేవనెత్తిందని, అందులో కొత్త విషయాలేవీ లేవని వెంకయ్య ప్రతినిధి వై.సత్యకుమార్‌ ఈమేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క.. తాము విదేశాల నుంచి విరాళాలే తీసుకోలేదని స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ సీఈఓ శరత్‌ బాబు, చైర్మన్‌ కేవీ విష్ణురాజు ఓ ప్రకటనలో తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top