మా జవాన్‌కు సంకెళ్లు వేస్తారా?

CoBRA jawan tied with chains at Karnataka police station - Sakshi

కర్ణాటక పోలీసులపై సీఆర్‌పీఎఫ్‌ అధికారుల ఆగ్రహం

న్యూఢిల్లీ/బనశంకరి: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్‌), కర్ణాటక పోలీసుల మధ్య లాక్‌డౌన్‌ చిచ్చు రాజేసింది. తమ జవాన్‌పై కర్ణాటక పోలీసులు లాఠీలతో దాడికి పాల్పడ్డారని, బేడీలు వేసి, పోలీసు స్టేషన్‌ దాకా నడిపించుకుంటూ తీసుకెళ్లారని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. బాధిత జవాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌కు లేఖ రాశారు.  

అసలేం జరిగింది?  
సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళంలో సచిన్‌ సావంత్‌ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం కర్ణాటకలోని ఎగ్జాంబా గ్రామం. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. 23న సావంత్‌ తన ఇంటి ముందు బైక్‌ను క్లీన్‌చేస్తుండగా పోలీసులు అటుగా వచ్చారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉంది, ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మాస్కు ఎందుకు ధరించలేదని నిలదీశారు. సావంత్‌ కూడా గట్టిగా బదులిచ్చారు. దీంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డారు. చేతికి బేడీలు వేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో గొలుసులతో బంధించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ దృశ్యాలన్నీ స్థానికుడొకరు తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top