114- 532 ఏళ్ల మహిళలకు ముఖ్యమంత్రి సాయం!!

114- 532 ఏళ్ల మహిళలకు ముఖ్యమంత్రి సాయం!!


ముఖ్యమంత్రి సిలాయీ యోజన, ముఖ్యమంత్రి సైకిల్ సహాయతా యోజన.. ఈ రెండూ ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆర్భాటంగా ప్రారంభించిన రెండు పథకాలు. ఇంతకీ వీటి లబ్ధిదారుల సగటు వయసెంతో తెలుసా.. 200 నుంచి 500 సంవత్సరాలు!! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న మహిళలకు కూడా గట్టిగా 115 ఏళ్లు లేని ఈ సమయంలో ఇంత పెద్దవాళ్లు ఎక్కడినుంచి వచ్చారని అనుకుంటున్నారా? ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు మచ్చుతునక ఇది. దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన ఈ పథకాలు ఎంతలా తప్పదోవ పట్టాయో సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో బట్టబయలైంది.



అసంఘటిత రంగంలో పనిచేసే మహిళా కూలీలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సైకిళ్లు పంచిపెట్టాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలను సీఎం రమణ్ సింగ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.15 లక్షల మంది మహిళలు ఈ పథకాల్లో లబ్ధి పొందినట్లు చూపించారు. సైకిళ్లు పొందాలనుకునేవారికి 18-35 ఏళ్లు, కుట్టు మిషన్లు పొందాలనుకునేవాళ్లకు 35-60 ఏళ్ల మధ్య వయసుండాలని నిబంధన పెట్టారు. కానీ, లబ్ధి పొందిన వారి వివరాలు ఇవ్వాలంటూ సంజీవ్ అగర్వాల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా.. విభ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి.



మొత్తం 19,399 కుట్టుమిషన్లు పంచిపెట్టగా, ఆ లబ్ధిదారుల్లో 6,189 మంది వయసు 114 ఏళ్లుగా చూపించారు. అంతేకాదు.. ఆరుగురికి 202 ఏళ్లు ఉన్నాయని, ముగ్గురికి 212 ఏళ్లు, ఇద్దరికి 282 ఏళ్లు ఉన్నాయని జాబితాలో ఉంది. 300 ఏళ్ల పైబడిన వాళ్లు కూడా 14 మంది ఉన్నారు, ఏడుగురైతే 400 ఏళ్లు దాటి ఉన్నారు. అందరికంటే అత్యధిక వయస్కురాలు 532 ఏళ్ల మహిళ అట!! ఇలా చాలా మంది పేర్లతో ఈ కుట్టు మిషన్లు, సైకిళ్లను పక్కదోవ పట్టించినట్లు బయటపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top