నక్సల్స్‌ దిష్టిబొమ్మల వ్యూహం!

Chhattisgarh Naxals Use Effigies, Dummy Guns To Confuse Security forces - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో బలగాలను తప్పుదోవపట్టిస్తున్న వైనం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో గత కొన్ని నెలల్లో తీవ్ర ఎదురుదెబ్బలు తిన్న నక్సలైట్లు, భద్రతా దళాలతో పోరాడేందుకు కొత్త వ్యూహాలు పన్నారు. భద్రతా దళ సిబ్బందిని తప్పుదారి పట్టించేందుకు మనుషుల దిష్టిబొమ్మలు, నకిలీ తుపాకులను వారు ఉపయోగిస్తున్నారు. జవాన్లను ఉచ్చులోకి దింపేందుకు వ్యూహాత్మకంగా ఈ దిష్టిబొమ్మలను అడవుల్లో అక్కడక్కడా పెట్టారు. గత ఎనిమిది రోజుల్లోనే సుక్మా జిల్లాలో ఇలాంటి 13 దిష్టిబొమ్మలను స్వాధీనం చేసుకున్నామని ఆ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు. గత కొన్ని నెలల్లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో నక్సలైట్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకు నక్సల్స్‌ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకుని ఉండొచ్చని ఎస్పీ చెప్పారు.

వియత్నాం యుద్ధంలో ఇలాంటి పద్ధతిని నాటి సైనికులు వినియోగించారనీ, అయితే నక్సల్స్‌ ఈ వ్యూహాన్ని అమలు చేయడం మాత్రం ఇదే తొలిసారని మీనా వెల్లడించారు. చింతగుహ అడవుల్లో దొరికిన ఓ దిష్టిబొమ్మ వద్ద అత్యాధునిక పేలుడు పదార్థాన్ని కూడా అమర్చారనీ, సైనికులపై దొంగదాడి చేసేందుకు లేదా వారిని పేలుడు పదార్థాలతో చంపేందుకు నక్సల్స్‌ ఈ కొత్త వ్యూహానికి తెరతీసి ఉండొచ్చన్నారు. పలు హాలీవుడ్‌ సినిమాలు, డాక్యుమెంటరీలు చూసి నక్సల్స్‌ ఈ తరహా కొత్త వ్యూహాలు పన్ని ఉండొచ్చని భద్రతా నిపుణుడొకరు చెప్పారు. పూర్తి వ్యూహం తయారుచేసే ముందు దిష్టిబొమ్మలకు భద్రతా దళ సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకే వారు ఇలా చేసి ఉంటారని ఆయన తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top