సుప్రీంకోర్టు తీరుపై అటార్నీ జనరల్‌ నిరసన

Centre places pricing details in sealed cover before SC - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వ్యవహారశైలిపై అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సోమవారం అసహనం వ్యక్తం చేశారు. చాలా పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించకుండానే కొట్టివేస్తోందని నిరసన తెలిపారు. రాజస్తాన్‌ ప్రభుత్వం తరఫున పన్ను చెల్లింపులకు సంబంధించి ఓ కేసులో వాదించేందుకు వేణుగోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిటిషన్‌ విచారణకు కోర్టు సుముఖంగా లేకపోవడంపై స్పందిస్తూ..‘ప్రజలు వేలాది కిలోమీటర్ల దూరం నుంచి న్యాయస్థానానికి వస్తున్నారు. కానీ మీరు మాత్రం కనీసం వారి వాదనలు వినకుండానే పిటిషన్లను కొట్టివేస్తున్నారు.

ఇది పద్ధతి కాదు. కనీసం పిటిషనర్ల వాదనలైనా కోర్టు వినాలి. ఇది ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన కేసు. కానీ సీజేఐ మాత్రం ప్రతివాదికి నోటీసు జారీచేసేందుకు ఆలోచిస్తున్నారు’ అని తెలిపారు. వెంటనే సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘సరే మిస్టర్‌ వేణుగోపాల్‌.. మీ వ్యాఖ్యలను సానుకూల దృష్టితో పరిగణనలోకి తీసుకుంటున్నాం. వాదనలు వినిపించండి. మేం పిటిషన్‌ను పరిశీలించలేదని భావించకండి. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ కచ్చితంగా పరిశీలిస్తాం’ అని వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top