నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందు జాగ్రత్తలకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది.
సాక్షి, ముంబై : నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందు జాగ్రత్తలకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వర్షాల వల్ల నిల్వచేరిన వరద నీటిని తొలగించడానికి మరో మూడు మినీ పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ పూనుకుంది. నగరంలో రెండు పంపింగ్ స్టేషన్లు, మరొక పంపింగ్ స్టేషన్‌ను శివారు ప్రాంతంలో నిర్మించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. దాదర్, చర్నీరోడ్, మాన్‌కుర్ధ్ తదితర ప్రాంతాల్లో నిలువ ఉన్న వర్షపు నీటిని తొలగించేందుకు ఈ మినీ పంపింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు. వీటి ద్వారా వరదనీటి నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించ డానికి బీఎంసీ చర్యలు తీసుకొంటోంది.
2005 ఘటనతో తేరుకున్న బీఎంసీ
జూలై 26, 2005లో వరద నీరు నగరాన్ని ముంచెత్తింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు నగరంలో ఎనిమిది పంపింగ్ స్టేషన్లను నిర్మించాలని అప్పుడే బీఎంసీ నిర్ణయించింది. ఇందులో రెండు పంపింగ్ స్టేషన్లు ఇర్లా, హజీ అలీలో ఏర్పాటు చేశారు. అవి ప్రస్తుతం పని చేస్తున్నాయి. క్లీవేలాండ్, లవ్‌గ్రోవ్ అనే రెండు పంపింగ్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. గజ్‌దార్ బాంద్, బ్రిటానియా స్టేషన్లలో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు. మోంగ్ర, మేహల్ పంపింగ్ స్టేషన్లు ఇంకా పేపర్ల వరకే పరిమితమై ఉన్నాయి.
చిన్న పంపింగ్ స్టేషన్లకు ప్రాధాన్యం
హిందుమాత, హిందు, దాదర్‌లోని పార్సీ కాలనీలలో నిలువ ఉన్న వరద నీటిని రే రోడ్‌లో ఉన్న బ్రిటానియా స్టేషన్ ద్వారా తొలగిస్తున్నారు. బ్రిటానియా పంపింగ్ స్టేషన్, అదేవిధంగా హిందు మాతకు మధ్య దూరం ఆరు కి.మీ. ఉంది. కానీ ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరద నీటిని సక్రమంగా తొలగించడం కష్టంగా మారింది. దీంతో చిన్న పంపింగ్ స్టేషన్ల వల్లనే ఈ సమస్య తీరనుందని, అందుకే వీటికి ప్రాధాన్యమిస్తున్నామని సర్వీస్, ప్రాజెక్ట్స్ డెరైక్టర్ లక్ష్మణ్ వాట్కర్ అభిప్రాయపడ్డారు. ముఖ్య స్టేషన్లలో ఆరు నుంచి 10 పంపింగ్‌లను అమర్చగా చిన్న స్టేషన్లలో నాలుగు పంపింగ్‌లను అమర్చనున్నామని చెప్పారు.