కుర్చీ వెనుక కహాని!

Bhupesh Baghal as Chief Minister of Chhattisgarh - Sakshi

బఘేల్‌ నియామకానికి కారణాలెన్నో

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా భూపేశ్‌ బఘేల్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు వరకు రాజకీయం రోజుకో రంగు మారింది. సీఎం కుర్చీకోసం భూపేశ్‌ బఘేల్, టీఎస్‌ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్‌ సాహు, చరణ్‌దాస్‌ మహంత్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. చరణ్‌దాస్‌ మహంత్‌ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అంతగా కష్టపడిందేమీ లేదన్న భావన అందరిలోనూ ఉంది. దీంతో ఆయన మొదట్లోనే సీఎం రేసు నుంచి తప్పుకున్నారు. తామ్రధ్వజ్‌ సాహుకు జనాకర్షణ అంతగా లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారింది. ఇక మిగిలింది భూపేశ్‌ బఘేల్, సింగ్‌దేవ్‌. వీరిద్దరూ సీఎం పదవి కోసం కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద గట్టిప్రయత్నాలే చేశారు. ఇద్దరికీ చెరి రెండున్నరేళ్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ భావించారు.

రాజీ కుదరకపోతే సాహును సీఎంను చేయాలని రాహుల్‌ భావించారు. ఈ విషయాన్ని పార్టీలో అంతర్గతంగా ప్రకటించారు. కానీ, ప్రజాప్రతినిధుల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్న రాహుల్‌ సమస్య పరిష్కారానికి సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేని రంగంలోకి దించారు. పార్టీకి చెందిన మొత్తం 68 మంది ఎమ్మెల్యేలతో ఖర్గే విడివిడిగా మాట్లాడారు. శక్తి యాప్‌ ద్వారా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఖర్గే చేసిన కసరత్తులో సింగ్‌దేవ్‌కే భారీగా మద్దతు లభించింది. దీంతో, ఛత్తీస్‌గఢ్‌ కాబోయే సీఎం సింగ్‌దేవ్‌ అన్న ప్రచారం ఒక రోజంతా సాగింది. తన నివేదికతో మల్లికార్జున ఖర్గే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలుసుకున్నారు. అక్కడ మళ్లీ సీన్‌ మారిపోయింది.

ఓబీసీ కార్డు బఘేల్‌కు అనుకూలంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌కు కారణం ఓబీసీల ఓట్లే. మరో అయిదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఓబీసీ నాయకుడినే సీఎంను చేయాలని పార్టీ ప్రధానకార్యదర్శి పీఎల్‌ పూనియా వంటి నేతలు రాహుల్‌కి సలహా ఇచ్చారు. దీంతో సింగ్‌దేవ్‌ స్థానంలో బఘేల్‌ పేరు చేరింది. సీఎం కుర్చీలో బఘేల్‌ ఎంత కాలం ఉంటారన్నది అనుమానమే. బఘేల్, సింగ్‌దేవ్‌లను చెరో రెండున్నరేళ్లు సీఎంగా చేయడానికే రాహుల్‌ నిర్ణయానికి వచ్చారని, లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మొదటి ప్రాధాన్యం బఘేల్‌కు ఇచ్చారని సమాచారం. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరు వంటివాటి ఆధారంగానే కాంగ్రెస్‌ అధిష్టానం భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఎమ్మెల్యేల అండదండలు, కార్యకర్తల మద్దతు సింగ్‌దేవ్‌కే ఉన్నప్పటికీ ఓబీసీ కార్డు బఘేల్‌ను సీఎం పీఠానికి దగ్గర చేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top