దళిత పిల్లల కోసం భీమ్‌ పాఠశాలలు...!

Bhim Schools For SC Childrens - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు కనీస సదుపాయాల లేమితో కూనారిల్లుతూ, పేద దళితవర్గాల వారికి  ప్రైవేట్‌స్కూళ్ల ఫీజులు కట్టే స్థోమత ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నతనంలో ఈ వర్గాల పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో  భీమ్‌ఆర్మీ వ్యవస్థాపకుడు  చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలియాస్‌ రావణ్‌ యూపీలో  భీమ్‌ పాఠశాలలు మొదలుపెట్టాడు. అయితే ఈ స్కూళ్లలోని టీచర్లు గణితం, సైన్స్, ఇతర సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల బోధనకే పరిమితం కావడం లేదు. దేశంలో దళితుల చరిత్ర, కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, దళితజాతిని ఉద్ధరించిన మహానుభావుల జీవితచరిత్ర, వంటివి చిన్నారుల్లో నాటుకునేలా వివరిస్తున్నారు. విద్య ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించి, మార్పునకు రంగం సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

నేపథ్యం...
బడి ముగిశాక కోచింగ్‌ క్లాస్‌ల రూపంలో దళితుల పిల్లలకు  రెండు గంటల పాటు  పాఠాలు చెప్పేందుకు మొదట 2015లో ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌లో ఓ పాఠశాలల ప్రారంభించారు.  క్రమంగా  మీరట్, ఆగ్రా, ముజాఫర్‌నగర్‌ ,ఇతర జిల్లాలకు ఈస్కూళ్లు విస్తరించాయి.  ప్రస్తుతం యూపీలో ఈ స్కూళ్ల సంఖ్య  వెయ్యికి పైగానే ఉంది.  షహరాన్‌పూర్, హరిద్వార్‌ జిల్లాల్లోనైతే వీటి సంఖ్య గణనీయంగా ఉంది.  చెట్టునీడలో, రవిదాస్‌ గుడి ఆవరణలో లేదా భీమ్‌ఆర్మీ కార్యకర్త నివాసంలోనో నిర్వహించే ఈ తరగతులకు అన్ని వయసుల్లోని విద్యార్థులు హాజరవుతారు. ప్రధానంగా స్టేషనరీ సామాగ్రి కోసం  రూ.3 వేల వరకు ఖర్చవుతుండడంతో ఆ మొత్తంతోనే ఒక్కో పాఠశాల నిర్వహిస్తున్నారు. టీచర్లు ఎలాంటి పారితోషకం తీసుకోరు. భీమ్‌ఆర్మీ సభ్యులు పాఠశాల నిర్వహణకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఈ వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు రెండేసి గంటల చొప్పున పిల్లలకు సంబంధిత విషయాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలల కొనసాగింపునకు అక్కడి ప్రజలు తమకు తోచిన విధంగా రూ. 50 నుంచి 300 వరకు విరాళాలిస్తున్నారు.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top