బెంగాల్‌ కరవుకు ఓ ‘మానవుడు’ కారణం

Bengal Famine Was Caused By Winston Churchill Policies - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1873–74, 1876, 1877, 1896–97, 1899, 1943.. ఈ సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు! భారతావనిపై కరవు జెడలు విప్పి కరాళ నృత్యం చేసిన పీడ ఎడాదులు. పీడ కలల్లా వాటిని మరచిపోవడమే మంచిది, ఒక్క 1943లో వచ్చిన బెంగాల్‌ కరవును మినహా. దాదాపు 30 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నందున బెంగాల్‌ కరవును మరచి పోరాదని చెప్పడం లేదు. అంతకుముందు సంభవించిన ఐదు కరవులకు, ఈ ఆరో కరవుకు ఎంతో తేడా ఉండడమే. అంతకుముందు కరవులన్నీ ప్రకృతి సిద్ధంగా సంభవించినవే. అంటే, వర్షాలు లేక వడగాలులు పెరిగి, పంటలు పండక, తినడానికి తిండిలేక సంభవించినవి.

కానీ బెంగాల్‌ కరవు అలాంటిది కాదు. ఓ మానవుడు అనుసరించిన విధానల వల్ల సంభవించిన కరవు. ఇది ఎలా రుజువైందంటే అమెరికా, భారత్‌ శాస్త్రవేత్తల బృందం కరవు సంభవించిన ఆ ఆరు కాలాల్లో భూమిలో తేమ శాతం ఎంతుందన్న విషయాన్ని పరిశోధనలతో ధ్రువీకరించడం ద్వారా. భూమిలో ఓ మోస్తారు స్థాయి వరకు తేమ ఉన్నట్లయితే ఆ సంవత్సరం వర్షాలు బాగానే కురిసినట్లు లెక్క. అంతకన్నా తేమ స్థాయి తగ్గుతూ పోతే అంత ఎక్కువ కరవు సంభవించినట్లు లెక్క. ఇక్కడ 1943లో మినహా మిగతా అన్ని కరవు సంవత్సరాల్లో భూమిలో తేమ బాగా తగ్గిందట.

1943లో భూమిలో ఎక్కువ తేమ ఉన్నట్లు తేలడమే కాకుండా ఆ ఏడాది చివరలో సమృద్ధిగా వర్షాలు కురిసినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆకలితో చనిపోయిన 30 లక్షల మందిలో ఎక్కువ మంది కూడా ఏడాది చివరలో మరణించడం గమనార్హం. ఈ కారణంగా 1943 నాటి కరవు ఓ మానవుడు సృష్టించిన కరవుగా గాంధీనగర్‌లోని ఐఐటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్‌ మిశ్రా, అమర్‌దీప్‌ తివారీ, శరణ్‌ ఆధార్, రీపల్‌ షా, మూ జీయావో, డీఎస్‌ పాయ్, డెన్నీస్‌ లెట్టన్‌మెయిర్‌తో కలిసి జరిపిన పరిశోధనల్లో తేల్చారు. వాటిని వివరాలను ‘జియోఫిజికల్‌ రిసర్చ్‌ లెటర్స్‌’ తాజా సంచికలో ప్రచురించారు.

ఆ మానవుడే విన్‌స్టన్‌ చర్చిల్‌
1943లో సంభవించిన బెంగాల్‌ కరవుకు నాటి బ్రిటీష్‌ ప్రధాన మంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. నాడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నందున చర్చిల్, బ్రిటీష్‌ సైన్యానికి భారీగా ఆహార పదార్థాలను భారత్‌ నుంచి తరలించారు. పరోక్షంగా జపాన్‌ దేశం కూడా కారణం. నాటి బర్మా నేటి మయన్మార్‌ను 1943లోనే జపాన్‌ ఆక్రమించుకొంది. దాంతో భారత్‌కు బియ్యం దిగుమతులు నిలిచిపోయాయి. అప్పటికి బర్మా నుంచే భారత్‌కు భారీగా బియ్యం దిగుమతులు వచ్చేవి. చర్చిల్‌ కారణంగా కాకుండా బర్మా నుంచి బియ్యం దిగుమతులు నిలిచి పోవడం వల్లనే ఎక్కువ కరవు ఏర్పడిందన్నది చరిత్రకారులు చెబుతూ వచ్చారు. చర్చిల్, బ్రిటీష్‌ సైన్యానికి భారీగా ఆహార దినుసులను ఎగమతి చేయడం వల్ల బెంగాల్లోని పేదలకు ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయని భూమిలో తేమను రుజువుగా చూపుతున్న ఈ పరిశోధకులు చెబుతున్నారు.

1873–74లో కరవు వచ్చినప్పుడు బెంగాల్‌కు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా పనిచేసిన రిచర్డ్‌ టెంపుల్‌ దేశంలోని వివిధ ప్రాంతాలు, పలు దేశాల నుంచి ఆహార దినుసులను దిగుమతి చేయించారట. ఆయన అనుసరించిన విధానాన్ని అనుసరించాల్సిందిగా విన్‌స్టన్‌ చర్చిల్‌ ముందుకు నాడు ప్రతిపాదన వస్తే ఆయన నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారట. 1943లో బయటి నుంచి ఆహార దినుసులను సరిపడా దిగుమతి చేసుకోకపోవడం తప్పిదమని భారతీయ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ కూడా 1981లో రాసిన ఓ వ్యాసం ఆరోపించారు.

70 వేల టన్నుల బియ్యం ఎగుమతి
1943లో జనవరి నుంచి జూలై నెలల మధ్య భారతదేశం నుంచి 70 వేల టన్నుల బియ్యం సైనిక అవసరాల కోసం ఎగుమతి అయ్యాయని, అది కరవును మరింత తీవ్రం చేసిందంటూ ‘చర్చిల్స్‌ సీక్రెట్‌ వార్‌: ది బ్రిటీష్‌ ఎంపైర్‌ అండ్‌ రివేజింగ్‌ ఆఫ్‌ ఇండియా డ్యూరింగ్‌ ది సెకండ్‌ వరల్డ్‌ వార్‌’ పుస్తకంలో (2011) మధుశ్రీ ముఖర్జీ రాశారు. సైన్యం కోసం బ్రిటన్‌లో అపార నిల్వలు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తంటూ భారత్‌ నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నారంటూ ఆమె తన పుస్తకంలో ఆరోపించారు. ఈ అంశం నాడు బ్రిటీష్‌ వార్‌ కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘మనలాగే అక్కడి ప్రజలకు కూడా ముందు జాగ్రత్త ఉండాలి’ అంటూ చర్చిల్‌ వ్యాఖ్యానించారని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘నరహంతక నియంతల్లో ఒకడైన, చేతులు రెండు రక్తంతో తడిసిపోయిన చర్చిల్‌నా స్వాతంత్య్ర పిపాసి, ప్రజాతంత్ర వాదిగా ప్రశంసించుమని బ్రిటీష్‌ మనకు చెప్పేది’ అని పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటున్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చిల్‌కు బాగా నప్పుతాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top