19 లక్షల పేర్లు గల్లంతు

Assam NRC final list released, 19 lakh applicants excluded - Sakshi

అస్సాంలో ఎన్‌ఆర్‌సీ తుదిజాబితా విడుదల

3.11 కోట్ల మందికి చోటు

బీజేపీ సహా అన్ని పార్టీల అసంతృప్తి

గల్లంతైనవారి భవిష్యత్తు ప్రశ్నార్థకం

వారు 120 రోజుల్లో ట్రిబ్యునల్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం

గువాహటి: వివాదాస్పద నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ తుదిజాబితా శనివారం విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్‌ఆర్‌సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు. అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్‌ ట్రైబ్యునళ్లలో అప్పీల్‌ చేసుకోవచ్చునని తెలిపింది.

ఎన్నార్సీకి వ్యతిరేకంగా గువాహటిలో హిందూయువ చాత్ర పరిషత్‌ సభ్యుల ఆందోళన

ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. శనివారం          ఉదయం పది గంటలకు ఎన్‌ఆర్‌సీ తుదిజాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించగా ప్రజల సందర్శనార్థం అన్ని ప్రతులను ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రాలు, డిప్యూటీ కమిషనర్, సర్కిల్‌ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచారు. తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు శనివారం వందలాది మంది ఈ కార్యాలయాల్లో క్యూ కట్టారు. పేర్లు ఉన్న వాళ్లు విరిసిన ముఖాలతో బయటకు రాగా.. కొందరు నిరాశగా వెనుదిరగడం కనిపించింది.  

అందరిలోనూ అసంతృప్తి...
ఎన్‌ఆర్‌సీ తుది జాబితాపై అటు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ, ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిం వలసదారులకు జాబితాలో చోటు దక్కిందని, స్థానికులను మాత్రం వదిలేశారని మంగల్దోయి మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేన్‌ డేకా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్‌ఆర్‌సీ రూపకల్పన జరిగినప్పటికీ అంత నాణ్యంగా ఏమీ జరగలేదని పెదవి విరిచారు. అర్హులైన వారు చాలామందిని జాబితాలోకి చేర్చలేదంటూ బార్‌పేట కాంగ్రెస్‌ నేత అబ్దుల్‌ ఖాలీక్‌ విమర్శించారు.

ఎన్నార్సీపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటున్న ప్రజలు

అక్రమ వలసదారుల బహిష్కరణకు ఆది నుంచి ఉద్యమాలు నడిపిన, ఎన్‌ఆర్‌సీ జాబితా సవరణకు సుప్రీంకోర్టుకెక్కిన ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మేము ఏమాత్రం సంతోషంగా లేము. జాబితాను సవరించే క్రమంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇది అసంపూర్తి జాబితా మాత్రమే. జరిగిన తప్పులన్నింటినీ సరిచేసేందుకు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతాం’’అని సంస్థ జనరల్‌ సెక్రటరీ లురిన్‌జ్యోతి గగోయ్‌ స్పష్టం చేశారు. గతంలో వేర్వేరు సందర్భాల్లో అక్రమ వలసదారులుగా ప్రకటించిన సంఖ్యకు, అధికారికంగా ప్రకటించిన అంకెకు ఏమాత్రం పొంతన లేదని గగోయ్‌ శనివారం ఒక విలేకరుల సమావేశంలో ఆరోపించారు.  

20 శాతం జాబితానైనా సమీక్షించాలి: హిమంతా
ఎన్‌ఆర్‌సీ తుది జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అసోం మంత్రి, నారŠ?త్తస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ కన్వీనర్‌ హిమంతా బిశ్వాస్‌ శర్మ... జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి ఉన్న జిల్లాల నుంచి ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కించుకున్న వారిలో కనీసం 20 శాతం మందినైనా మరోసారి పునః పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వాలని ఆయన కోరారు. మిగిలిన జిల్లాల్లో 10 శాతం పునః పరిశీలన ద్వారా కచ్చితమైన జాబితా రూపొందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘1971 కంటే ముందు బంగ్లాదేశ్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కలేదు. శరణార్థిగా ధ్రువీకరించే పత్రాలను అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పాత జాబితాల్లో అవకతవకల కారణంగా కొంతమంది ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కించుకోగలిగారు’’అని హిమంత ఓ ట్వీట్‌ కూడా చేశారు. ఎన్‌ఆర్‌సీ సవరణకు ముందుగా సుప్రీంకోర్టు తలుపుతట్టిన ‘ద అసోం పబ్లిక్‌ వర్క్స్‌’’కూడా తుదిజాబితా లోపభూయిష్టమైందని వ్యాఖ్యానించారు. పునః పరిశీలన చేయాలన్న తమ డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన కారణంగా తుదిజాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయని సంస్థ అధ్యక్షుడు అభిజీత్‌ శర్మ వ్యాఖ్యానించారు.

ఎన్నార్సీ అస్సాంకేనా?
అస్సాంలో మాదిరిగానే బంగ్లాదేశీయుల వలసలు ఎక్కువగా ఉన్న ఢిల్లీతోపాటు శ్రీనగర్‌లోనూ ఇలాంటి వివరాలు సేకరించాలని విశ్లేషకులు అంటున్నారు. అంతకంటే ముందుగా ఎన్నార్సీ ప్రక్రియను పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లోనూ మొదలుపెట్టాలని, ఈ ప్రక్రియ ఏ ఒక్క మతానికో లేక వర్గానికో పరిమితం కారాదని అంటున్నారు. అసోంతోపాటు చాలా రాష్ట్రాల్లో అక్రమ వలసదారులున్నందున ఇలాంటి ప్రక్రియను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. ఎన్నార్సీ ప్రక్రియలో నిర్దేశిత విధానాలను పాటించాలని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది.

పశ్చిమబెంగాల్‌ అయినా హిమాచల్‌ ప్రదేశ్‌ అయినా ఎన్నార్సీ సమీక్షలో ఆయా రాష్ట్రాలు సహకరించాలి. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు తమ అనుకూల వలసవాదులను ఎన్నార్సీ జరగని రాష్ట్రాలకు పారిపోయేలా సహకరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. జాతి హితం దృష్ట్యా ఈ వివాదంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లను లాగకుండా పార్టీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అక్రమ వలసదారులు, కాందిశీకులు కానటువంటి నిజమైన భారతీయులను గుర్తించడమే ఎన్నార్సీ లక్ష్యం కావాలంటున్నారు. రొహింగ్యాలను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్‌ ప్రయత్నిస్తుండగా కోట్లాది బంగ్లాదేశీయుల్లో పట్టుమని 50 మందిని  ప్రభుత్వం వెనక్కి పంపించలేక పోవడం ఏమిటంటున్నారు.

ఎన్నార్సీ పూర్వాపరాలివీ..
► 1951:     స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) తయారైంది
► 1955:     భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు.
► 1951     1966: తూర్పు పాకిస్థాన్‌ (బంగ్లాదేశ్‌) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది.
► 1965:     భారత పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు.
► 1971:    మరోసారి వెల్లువలా చొరబాట్లు.
► 1979:    అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు
► 1983:    నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు.
► 1985    భారత ప్రభుత్వం, ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్‌ తేదీగా నిర్ణయం.  
► 1997    అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో ‘డీ’అక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం
► 2003    పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు.
► 2005    1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్‌ఆర్‌సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం.
► 2010    బార్‌పేటలోని ఛాయాగావ్‌లో ఎన్‌ఆర్‌సీ జాబితా సవరణ తాలూకూ పైలట్‌ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత.
► 2016    ఎన్‌ఆర్‌సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు
► 2017    డిసెంబరు 31న ఎన్‌ఆర్‌సీ తొలి ముసాయిదా జాబితా విడుదల
► 2019    జూలై 31న ఎన్‌ఆర్‌సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు
► 2019    ఆగస్టు 31. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top