
గువహటి: ఒకసారి ఓట్లేసి గెలిపించిన తరువాత తిరిగి ఓటర్ల ముఖం చూడని ప్రజా ప్రతినిధులను చూస్తుంటాం. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప ఇంకెప్పుడు వారికి ప్రజలు గుర్తు రారు. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఏదో వచ్చామా, చూశామా, వెళ్లామా అన్నట్లు ఉంటారు. అయితే అసోంలోని ఒక ఎమ్మెల్యే మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించించారు. తన నియోజక వర్గంలో వరదలో చిక్కుకున్న ప్రజలను, పశువులను స్వయంగా నీటిలోకి దిగి మరీ కాపాడారు.
చదవండి: వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం
గత కొద్ది రోజులుగా అసోంను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసోం ఎమ్మెల్యే మృణాల్ సైకియా వరదలో చిక్కుకున్న మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలను కాపాడే సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. నీటిలోకి దిగిమరి వారిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో తన చేతులతో ఒక బాబును పైకి ఎత్తి పట్టుకొని, నడుము వరకు లోతున్న నీటి నుంచి ఆ బాబును కాపాడారు. ‘మా నియోజకవర్గంలో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి మేం ప్రజలను కాపాడుతున్నాం’ అని పేర్కొన్నారు. ఇక ప్రజలతో పాటు పశువులను వరద ముప్పు ప్రాంతం నుంచి తరలిస్తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ‘మా గ్రామ ఆర్ధిక వ్యవస్థలో పశువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వందలాది మేకలను కాపాడినందకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.
ఈ వీడియోలు చూసిన నెటిజన్లు మృణాల్‌ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ‘మీరు ఎంతో మంది ప్రజల ప్రతినిధులకు ఆదర్శం. ఇప్పటి నుంచైనా మిగిలిన వారు మీలా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రజల రుణం తీర్చుకునే సమయమిది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. 27 జిల్లాలకు చెందిన 22లక్షల మంది ఈ వరదల వల్ల ప్రభావితమయ్యారు. సుమారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు.