
లక్నో: సార్వత్రిక ఎన్నికలపై భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రభావం ఉండదని, వాటిని సమయానికే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో సీఈసీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించింది. సరిహద్దుల్లో పరిస్థితి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పందిస్తూ..సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తెలిపారు. పోటీచేసే అభ్యర్థులు విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని కూడా వెల్లడించాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ప్రకటించే ఆస్తుల వివరాల్ని ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తుందన్నారు. 1,63,331 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ యంత్రాల సాయంతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
వచ్చే వారమే షెడ్యూల్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే వారంలో ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెప్పాయి. మీడియా సమావేశంలో ప్రధాన కమిషనర్, కమిషనర్లు ఈ మేరకు ప్రకటన చేస్తారని తెలిపాయి. ఇప్పటికే కమిషన్ 2–3 ప్రత్యామ్నాయ షెడ్యూల్స్‌ను ఖరారుచేసిందని, అందులో నుంచి ఒకదాన్ని ప్రకటిస్తుందని వెల్లడించాయి. మరోవైపు, షెడ్యూల్ రాకముందే మరో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు కొందరు కేంద్ర మంత్రులు సంకేతాలిచ్చారు. ఇక ఎన్నికల సన్నాహాల తుది సమీక్షలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.