కంప్యూటర్లపై కేంద్రం నిఘా

all are computers under government watch - Sakshi

సమాచారంపై నిఘా పెట్టేందుకు 10 సంస్థలకు అధికారాలు

జాబితాలో సీబీఐ, ఈడీ, రా, సీబీడీటీ తదితర సంస్థలు

అధీకృత సంస్థగా వ్యవహరించనున్న హోం శాఖ కార్యదర్శి

సమీక్ష కమిటీకి లోబడి నిఘా ప్రక్రియ

నిఘా రాజ్యం వస్తుంది: విపక్షాలు..లేదు రక్షణలున్నాయి: కేంద్రం

న్యూఢిల్లీ: కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా నేత్రం పెట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దేశంలోని ఏ కంప్యూటర్‌లోకి అయినా చొరబడి, అందులోని సమాచారాన్ని విశ్లేషించేందుకు, డీక్రిప్ట్‌(సంకేత భాష నుంచి సాధారణ భాషలోకి మార్చడం) చేయడానికి పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారాలిచ్చింది. ఇందులో దర్యాప్తు, నిఘా, భద్రత, పోలీసు విభాగాలున్నాయి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటాక నోటిఫికేషన్‌ జారీ అయింది. నిఘా సంస్థలకు కొత్తగా ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, 2009 నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే తాజా ఆదేశాలు జారీ చేశామని కేంద్రం ప్రకటించింది.

మరోవైపు, తాజా నోటిఫికేషన్‌ పౌరుల ప్రాథమిక హక్కులను ప్రమాదంలోకి నెడుతుందని, దేశాన్ని నిఘా రాజ్యంగా మారుస్తుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వ చర్య చట్టబద్ధమేనని, ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా సమాచార సాంకేతిక చట్టంలో పలు రక్షణలున్నాయని కేంద్రం సమర్థించుకుంది. విపక్షాలు గుడ్డిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని తిప్పికొట్టింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలోని సైబర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ డివిజన్‌ ఈ నిబంధనల్ని రూపొందించింది.

ప్రయోజనాలు ఇవే..
‘ఏవైనా కంప్యూటర్లలో భద్రపరచిన, రూపొందించిన, అక్కడి నుంచి వేరే చోటికి పంపిన, వేరేచోటి నుంచి స్వీకరించిన సమాచారాన్ని అడ్డగించి, పర్యవేక్షించి, డిక్రిప్ట్‌ చేయడానికి ఈ పది సంస్థలకు అధికారాలు ఇస్తున్నాం’ అని హోం శాఖ ప్రకటనలో తెలిపింది. టెలిగ్రాఫ్‌ చట్టంలో మాదిరిగానే ఈ అధికారాలు దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌తో మూడు ముఖ్య ప్రయోజనాలున్నట్లు తెలిపింది. అందులో మొదటిది..సమాచార విశ్లేషణ, పర్యవేక్షణ చట్ట పరిధికి లోబడి జరుగుతుంది. రెండోది..ఈ అధికారాల్ని కొన్ని సంస్థలకే కట్టబెట్టడం ద్వారా అవి ఇతర సంస్థలు, వ్యక్తుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా నిరోధించవచ్చు. మూడోది.. దేశ సార్వభౌమత్వం, రక్షణ, ఇతర ప్రయోజనాల రీత్యా అనుమానాస్పద సమాచార మార్పిడిపై ఓ కన్నేసేందుకు వీలవుతుంది.  

హోం శాఖ కార్యదర్శి అనుమతితోనే..
కంప్యూటర్లపై నిఘా పెట్టే ముందు కంపీటెంట్‌ అథారిటీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69లోని ఉప సెక్షన్‌1లో పేర్కొన్న అవసరం మేరకు పలానా కంప్యూటర్లలోని సమాచారంపై నిఘా ఉంచాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జాబితాలోని సంస్థను కోరొచ్చు. టెలిగ్రాఫ్‌ చట్టం మాదిరిగానే ఇక్కడ కూడా సమీక్ష కమిటీకి లోబడికి ఈ మొత్తం ప్రక్రియ జరుగుతుంది. కేబినెట్‌ సెక్రటరీ నేతృత్వంలోని ఈ కమిటీ కనీసం రెండు నెలలకోసారి సమావేశమై తమ ముందుకొచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రాల స్థాయిలో సమీక్ష కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిఘా సంస్థలు కోరితే సర్వీస్‌ ప్రొవైడర్లు, కంప్యూటర్‌ వినియోగదారులు, చివరికి వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగదారులు కూడా అవసరమైన సహకారం అందించాలి. లేని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం.. పలానా ఫోన్‌కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయాలని కేంద్ర హోం శాఖ       కార్యదర్శి నిఘా, భద్రతా సంస్థల్ని ఆదేశించేందుకు ఇది వరకే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే.

పాత నిబంధనలు అమలుచేసేందుకే: జైట్లీ
హోం శాఖ తాజా నోటిఫికేషన్‌ రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిఘా రాజ్యాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు మూకుమ్మడిగా దుమ్మెత్తిపోశాయి. కంప్యూటర్లలోని సమాచారాన్ని అడ్డగించి, విశ్లేషించేందుకు యూపీఏ హయంలో 2009లోనే నిబంధనలు రూపొందించారని, వాటిని అమలుచేసే సంస్థల్నే తాజాగా ప్రకటించామని కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. దేశాన్ని పోలీసు రాజ్యంగా మారిస్తే ప్రధాని మోదీ సమస్యలు పరిష్కారం కావని, నిఘా పెంచే ప్రయత్నాలు ఆయన ఓ అభద్ర నిరంకుశ పాలకుడని సూచిస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాగా, ఇదే వ్యవహారం పార్లమెంట్‌ను కూడా కుదిపేసింది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి తుది దశకు చేరుకుందని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తితే బాగుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తిప్పికొట్టారు. పుట్టలు కూడా లేనిచోట శిఖరాలు ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

కంప్యూటర్లపై నిఘా ఉంచేందుకు కేంద్రం అధికారాలిచ్చిన సంస్థలు ఇవే..
1.ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) 2. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో 3.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 4.ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) 5.డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) 6. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ 7. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) 8. రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) 9. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌(కశ్మీర్, ఈశాన్య రాష్ట్రా ల్లో సేవల నిమిత్తం) 10. ఢిల్లీ పోలిస్‌ కమిషనర్‌.

దేశ భద్రత కోసమే
‘దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ ఉత్తర్వులు జారీచేశాం. పౌరుల కంప్యూటర్లపై నిఘాకు 10 సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి’                
– ఐటీ మంత్రి రవిశంకర్‌
 
కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం
‘పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నామని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. ఇది అబద్ధం. ఈ టెక్నాలజీని వాడకుంటే ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోగలం?’             
– ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
 
మోదీ గురించి తెలుస్తుంది
‘మోదీజీ.. భారత్‌ను పోలీస్‌ రాజ్యంగా మార్చేస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అది కేవలం మీరు ఎంత అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్న నియంతో దేశంలోని 100 కోట్ల మందికిపైగా ఉన్న భారతీయులకు తెలియజేస్తో్తంది’              
– కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ
 
కొత్త ఉత్తర్వులెందుకు?
2009 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉంటే కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఏముంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి భయం పట్టుకుంది. దీంతో నిఘా పెట్టడం, సమాచార చౌర్యం ద్వారా  ప్రజలను బెదిరించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది’
–కాంగ్రెస్‌ నేత జయ్‌వీర్‌ షేర్గిల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top