మీరిలా చేయడం సబబేనా..?

Air India Sexual Harrasment Victim Identity Revealed By Women And Child  Development Ministry - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియా సీనియర్‌ ఉద్యోగి తనను ఆరేళ్ల పాటు లైంగికంగా వేధించారని, తన ఫిర్యాదుపై సంస్థ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఎయిర్‌హోస్టెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ(డబ్ల్యూసీడీ) తప్పిదం వల్ల లైంగిక దాడికి గురైన ఆ ఎయిర్‌ హోస్టెస్‌ పేరు బహిర్గతమైంది.

సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన డబ్ల్యూసీడీ.. ‘ఎయిర్‌ ఇండియాలో పనిచేస్తున్న మిస్‌***** మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీని కలిశారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం- 2013ను అనుసరించి ఆమె తన ఫిర్యాదును నమోదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపించాల్సిందిగా మేనకా గాంధీ పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు, ఎయిర్‌ ఇండియా అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల(జూన్‌) చివరిలోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా మేనకా గాంధీ ఆదేశించారంటూ’ నోట్‌ను విడుదల చేసింది. అయితే వెంటనే తప్పును తెలుసుకున్న డబ్ల్యూసీడీ.. బాధితురాలి పేరును తొలగించింది.

అత్యాచార బాధితులు, అత్యాచారానికి గురైన మైనర్ల పేర్లు, ఫొటోలు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటన బాధితురాలి పేరు, ఫొటోను బహిర్గతం చేసిన మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది కూడా. అయితే ఇప్పుడు ఏకంగా మహిళా సంక్షేమ శాఖే బాధితురాలి పేరు బహిర్గతం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top