దేశంలో మ‌రో వైర‌స్‌.. ఇది కూడా చైనా నుంచే! | African Swine Flu Detected In Assam 2500 Pigs Killed | Sakshi
Sakshi News home page

అస్సాంలో వెలుగుచూసిన స్పానిష్ ఫ్లూ

May 4 2020 12:33 PM | Updated on May 4 2020 4:13 PM

African Swine Flu Detected In Assam 2500 Pigs Killed - Sakshi

గువ‌హ‌టి : అస‌లే దేశంలో కరోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో వైర‌స్ వెలుగుచూసింది. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూగా పిలి‌చే ఈ వైర‌స్ మొట్ట‌మొద‌టిసారిగా అస్సాంలో బ‌య‌ట‌ప‌డిందని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి)  ఈ వైర‌స్‌ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించిన‌ట్లు తెలిపింది. అయితే దీనివల్ల మ‌నుషుల‌కు పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌ని, దీనికి కోవిడ్‌తో ఎటువంటి సంబంధం లేద‌ని పేర్కొంది. అస్సాంలో ఇప్ప‌టివ‌ర‌కు 306 గ్రామాల్లో ఈ వైర‌స్ ప్ర‌బ‌లి 2,500 పందులు మ‌ర‌ణించాయి.  (ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం!)

పందుల లాలాజలం, ర‌క్తం, మాంసం ద్వారా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్ర‌మించే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంటువ్యాధి కావ‌డంతో దీని నివారణకు పందుల‌ను సామూహికంగా చంపేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. అయితే తాము ఆ ప‌నిని చేయ‌మ‌ని, ప్ర‌త్యామ్నాయ ప‌ద్ద‌తుల్లో అడ్డుక‌ట్ట వేస్తామ‌ని అస్సాం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా వైర‌స్ ప్ర‌బ‌లిన జిల్లాల నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు పందుల ర‌వాణా ఆపేశామ‌ని తెలిపింది. పొరుగు రాష్ట్రాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా అస్సాం పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు. 

ఈ వైర‌స్ ఇంకా పెద్ద‌గా వ్యాప్తిచెంద‌లేద‌ని, ఇప్ప‌టికే నమూనాలు సేక‌రించి మూడు ప్ర‌త్యేక ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 2019 ఏప్రిల్‌లో ఈ వైర‌స్ చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్ గ్రామంలో బ‌య‌ట‌ప‌డింద‌ని, అక్క‌డినుంచి అరుణాచ‌ల్ మీదుగా అస్సాంలో వ్యాధి ప్ర‌బ‌ల‌డానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. అయితే వైర‌స్ పెద్ద‌గా ప్ర‌మాదం కాద‌ని, వ్యాధి ప్ర‌బ‌ల‌ని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చ‌ని ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ అధికారులు పేర్కొన్నారు. (కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు )

Advertisement
 
Advertisement
Advertisement