ఆ మోసాలను ఆధార్‌తో అడ్డుకోలేం!

Aadhaar no solution to scams as bank officials are hand in glove with fraudsters, says Supreme Court - Sakshi

బ్యాంకింగ్‌ రంగంపై సుప్రీం కోర్టు

ఉగ్ర నియంత్రణకూ చూపుతున్న కారణం సహేతుకం కాదు

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక నేరాలు, ఉగ్ర కార్యకలాపాల కట్టడికి ఆధార్‌ దోహదపడుతుందన్న కేంద్రం వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది. బ్యాంకింగ్‌ మోసాలకు ఆధార్‌తో పరిష్కారం లభించదంది. ఆధార్‌ చట్టబద్ధత, చెల్లుబాటుపై గురువారం సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, ప్రభుత్వ తరఫు లాయర్ల మధ్య ఆసక్తికర వాదనలు జరిగాయి.  ‘బ్యాంకులను మోసగిస్తున్న వారెవరో అంతా బహిరంగంగానే తెలిసిపోతోంది. ఎవరెవరికి రుణాలు మంజూరు అవుతున్నాయో బ్యాంకులకు తెలియదా? అధికారులే మోసగాళ్లతో చేతులు కలిపి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు ఆధార్‌ పరిష్కారం చూపదు’ అని బెంచ్‌ పేర్కొంది.  

లబ్ధిదారుల గుర్తింపునకే ప్రయోజనకరం
సంక్షేమ పథకాల అసలు లబ్ధిదారులను గుర్తించడంలో మాత్రమే ఆధార్‌ ప్రభుత్వానికి సహాయపడుతుందని బెంచ్‌ పేర్కొంది. మొబైల్‌ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు, బాంబు దాడులను నివారించొచ్చని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. దీనికి ప్రతిగా బెంచ్‌ స్పందిస్తూ.. ‘ఉగ్రవాదులు సిమ్‌ కార్డులకు దరఖాస్తు చేసుకుంటారా? కొంత మంది ఉగ్రవాదులను పట్టుకోవడానికి 120 కోట్ల మంది భారతీయులు మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో అనుసందానం చేసుకోవాలని అడుగుతున్నారు.

కేవలం చట్టబద్ధ జాతీయ ప్రయోజనాల రీత్యా అలా కోరడం సబబేనా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల బతుకులు బాగుచేయడంలో ఆధార్‌ దోహద పడుతుందని వేణుగోపాల్‌ పేర్కొనగా.. ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోందని, 67% సంపద ఒక శాతం ధనికుల వద్దే పోగైందని బెంచ్‌ పేర్కొంది. ప్రతిదానికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడం వల్లే అనవసర సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top