ఆ పాప ఆరుగురికి జీవం పోసింది
													 
										
					
					
					
																							
											
						 చెన్నైలోని కరూర్ కి చెందిన  చిన్నారి ఆరుగురికి ప్రాణదానం చేసి చిరంజీవిగా నిలిచింది.
						 
										
					
					
																
	చెన్నై:  మరణించినా  జీవించి ఉండటం.. మరో మనిషికి ప్రాణం పోయడం ఒక్క అవయవ దానం ద్వారా  మాత్రం సాధ్యమవుతంది. అలా చెన్నైలోని కరూర్‌కి చెందిన  చిన్నారి  ఆరుగురికి ప్రాణదానం చేసి చిరంజీవిగా నిలిచింది.  తమిళనాడులో అతి చిన్న వయసులో అవయవదానం చేసిన 'దాత' గా ఖ్యాతిని దక్కించుకుంది.
	 
	ఒకటో తరగతి చదువుతున్న జనశృతి (5) తల్లితో పాటు  స్కూలుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో కోవై మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ కూడా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆరోగ్యం మరింత విషమించి చివరకు చికిత్సకు చిన్నారి స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా బుధవారం ఉదయం డాక్టర్లు  ధ్రువీకరించారు. 
	 
	తమ ముద్దులబిడ్డ అకాలమరణంతో పుట్టెడు శోకంలో మునిగిపోయినా ఆమె తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకున్నారు. తమ చిన్నారి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె రెండు కిడ్నీలు, లివర్, గుండె కవాటాలను వైద్యులు సేకరించారు. అనంతరం రెండు కళ్లను స్థానిక అరవింద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. మిలిగిన అవయవాలను ప్రత్యేకవిమానంలో వివిధ ఆస్పత్రులకు తరలించిన ప్రత్యేక వైద్య బృందం వాటిని అవసరమైన  రోగులకు అమర్చింది. కాగా పరమత్తి వెల్లూరు ప్రభుత్వ  హాస్టల్లో కుక్గా పనిచేస్తున్న జనశృతి తండ్రి  తంగవేలు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలా అవయవదానంతో తమ కూతురు సజీవంగా ఉండడం గర్వంగా ఉందన్నారు.