భారత్‌కు రూ.10 లక్షల కోట్ల నష్టం!

A 5 Percent Contraction in 2020 21 GDP Is Equal To Rs 10 Lakh Crore - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటిని ఆర్థికంగా ఎంతో కుంగదీసింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం దేశాలన్ని లాక్‌డౌన్‌ అమలు చేశాయి. దాంతో అన్ని రంగాలు షట్‌డౌన్‌ అయ్యాయి. ఆర్థిక కార్యాకలాపాలు కుంటుపడ్డాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐఎమ్‌ఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ కూడా తీవ్రమైన ఆర్థికమాంద్యం ఎదుర్కొబోతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో 2019-20కి గాను భారతదేశ జీడీపీ203 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 5 శాతం తగ్గుదల ఉండనున్నట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇది సుమారుగా రూ.10లక్షల కోట్లుగా ఉండనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో కరోనా కేసులో ఎప్పుడు గరిష్టంగా ఉంటాయో చెప్పలేకపోతున్నారు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారీగానే ఉండనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఆర్థిక నష్టం ఇంకా ఎక్కువగానే ఉండనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.(భారత్‌ నుంచి 12 లక్షల కోట్లు వెనక్కి)

భారత్‌లో కరోనా కట్టడి కోసం వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలోనే 68 రోజుల కఠిన లాక్‌డౌన్‌ను విధించారు. దాంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడ్డాయి. దాంతో బీద, బిక్కి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటి నుంచి దేశంలో కరోనా కేసులు అనుహ్యాంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ కేసుల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు తూర్పు భారతదేశంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభిచవచ్చు. కానీ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదు. ప్రస్తుతం దేశంలో ఖరీఫ్‌ సీజన్‌ మధ్యలో ఉంది. ఈ సమయంలో వ‍్యవసాయ కార్యకలాపాలు జోరుగా సాగుతాయి. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పనులు కూడా బాగానే సాగుతున్నాయి. అయితే ఈ రెండు ఒకేసారి ముగుస్తాయి. అప్పుడు గ్రామీణభారతం కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. (మరో విడత ఉద్దీపన ప్యాకేజీ!)

కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్నఅతి పెద్ద సవాలు. ఇవి తేలికగా పరిష్కారమయ్యేవి కావు. ప్రభుత్వాలు పేదలకు బియ్యం పంపిణీ వంటి వాటి మీదనే కాక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాక ఈ సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు విమర్శలు చేయడం మాని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top