కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు; నలుగురికి గాయాలు

4 People Injured In Terror Attack In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్‌ : కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. లోయలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు శనివారం దాడులకు పాల్పడ్డారు. కశ్మీర్‌, సోపోర్ జిల్లాలో ఓ పండ్ల వ్యాపారి ఇంటి వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఇంటిలిజెన్స్‌ అధికారులు తెలిపారు. ఈ దాడిలో రెండేళ్ల చిన్నారితో సహా నలుగురు గాయపడ్డారని.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉగ్రవాదులు అక్కడ దుకాణాన్ని మూసివేయాలని సదరు దుకాణదారును హెచ్చరించారని అధికారులు తెలిపారు.  అయితే వారి హెచ్చరికలను ఖాతరు చేయకుండా దుకాణాన్ని నడిపినందుకు ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల చిన్నారిని ఆధునిక వైద్య నిమిత్తం ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీకి పంపుతున్నట్లు శ్రీనగర్‌ జిల్లా అధికారి పేర్కొన్నారు. ప్రజల్లో భయందోళనలను సృష్టించడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నంగా ఈ సంఘటన కనిపిస్తుందని  పేర్కొన్నారు. గత నెలలో బారాముల్లా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు వెల్లడించారు. కశ్మీర్‌ అంతా భద్రతా దళాలు మోహరించి ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని  పోలీసులు స్పష్టం చేశారు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top