నాది 2018 బ్యాచ్‌

YSR Biopic Yatra Movie Hero Mammootty Interview - Sakshi

‘‘ఇప్పటివరకు దాదాపు 375 చిత్రాల్లో నటించాను. ఏడాదికి ఐదారు సినిమాలు చేయాలని నేను ఒప్పందం కుదుర్చుకోవడంలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తూ వెళ్తున్నానంతే. సినిమాల పట్ల నాకు ఉన్న తపన అలాంటిది’’ అన్నారు మలయాళ స్టార్‌ మమ్ముట్టి. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ నెల 8న సినిమా విడుదలవుతున్న  సందర్భంగా మమ్ముట్టి చెప్పిన విశేషాలు.

► చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేశాను. తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారు. ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉంటుంది. వైఎస్సార్‌ లాంటి లెజెండరీ క్యారెక్టర్‌ కోసం మహి పూర్తి స్క్రిప్ట్‌తో నా వద్దకు వచ్చారు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సినిమా ఆలస్యం కాకుండా నిర్మించగల మంచి నిర్మాత దొరికారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఈ ‘యాత్ర’ సినిమా చేయడానికి.

► వైఎస్సార్‌ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్‌ చేయలేదు. ఆయనది డిఫరెంట్‌ పర్సనాలిటీ. సినిమాలో సోల్‌ ఆఫ్‌ ది క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకుని నటించాను. స్క్రిప్ట్‌ ప్రకారం చేశానంతే. ఒక గొప్ప వ్యక్తి లైఫ్‌ని రెండుగంటల్లో చెప్పడం కష్టం. ఇది పూర్తి బయోపిక్‌ కాదు. వైఎస్సార్‌ పాదయాత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం. పాదయాత్రలో భాగంగా వైఎస్సార్‌ ప్రజలను కలవడం, వారితో మాట్లాడటం, వారి భావోద్వేగాలను పంచుకోవడం, వారి సమస్యలను విని పరిష్కార మార్గాల గురించి చర్చించడం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది.

► వైఎస్సార్‌ పాత్రలో పాద యాత్ర చేసినప్పుడు సినిమాలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకునే సీన్స్‌ ఉంటాయి కదా. ఆ కష్టాలన్నీ నిజంగా జరిగినవే. అవి విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది.  నా ఎమోషన్‌ను కంట్రోల్‌ చేసుకున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నది పాత్ర అని నాకు తెలుసు. ప్రజల సమస్యలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. పేదరికం ఒకేలా ఉంటుంది.

► మహి డైరెక్ట్‌ చేస్తున్నట్లు నాకు అనిపించలేదు. బాగా చేశారు. టీమ్‌ ఎఫర్ట్‌ ఇది. షూటింగ్‌ అంతా విహార యాత్రలా గడిచింది. ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ రావడం చాలా సంతోషంగా అనిపించింది. యాత్రలో నాకు యంగ్‌ ఏజ్‌ ఫాదర్‌గా నటించారు జగపతిబాబు. నా ‘మధురరాజా’ (మలయాళం) సినిమాలో ఆయనతో మంచి కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి.

► నా కెరీర్‌లో ఇప్పటివరకు 70కి పైగా కొత్త దర్శకులతో పని చేశాను. వారిలో దాదాపు 90 శాతం మంది మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఇద్దరు పెద్ద దర్శకులు అయ్యారు. మహి వి. రాఘవ్‌ ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు.

► కొత్తభాష నేర్చుకోవడమంటే నాకు చాలా ఆసక్తి. అందుకే ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా. నా దర్శక నిర్మాతలు, నా సహచర నటులు నా తెలుగు పట్ల హ్యాపీగానే ఉన్నారు. తెలుగు, మలయాళ భాషలో కొన్ని సిమిలర్‌ పదాలు ఉన్నాయి. ఉచ్చారణలో పెద్ద తేడా లేదు. కొన్ని టేక్స్‌ తీసుకుని ఫైనల్‌గా బాగానే కంప్లీట్‌ చేశాను.

నా కెరీర్‌లో పొలిటికల్‌ చిత్రాలు ఉన్నాయి. కానీ బయోపిక్స్‌ లేవు. ‘అంబేద్కర్, బషీర్‌’ల బయోపిక్స్‌ మాత్రమే చేశాను. 38 ఏళ్లు సినిమాల్లో గడిచిపోయాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం ఎందుకు? ఇవే (సినిమా) నా  రాజకీయాలు (నవ్వుతూ).

► గత 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్‌లో మార్పు కనిపిస్తోంది. విశ్వనాథ్‌గారు భిన్నమైన చిత్రాలు చేశారు. నేను గ్రే షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ చేశా. తెలుగులో మంచి మసాలా సినిమా చేసే అవకాశం రాలేదు. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో ‘రైల్వేకూలి’ అనే సినిమా అంగీకరించాను. అది పూర్తి కాలేదు.

► నేను తెలుగు సినిమాలు చూస్తాను. ‘రంగస్థలం, భరత్‌ అనే నేను’ సినిమాలు చూశాను. తెలుగుభాషపై పట్టు కోసం యూట్యూబ్‌లో కొన్ని క్లిపింగ్స్‌ చూశాను. ఇప్పుడు నేను చేస్తున్న నా మలయాళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్‌ అవుతాయా? కావా? అనేది ‘యాత్ర’ రిజల్ట్‌ని బట్టి ఉంటుంది.

► వైఎస్‌ జగన్‌ను నేను కలవలేదు. వైఎస్సార్‌సీపీ అభిమానులు ఎవరూ ఈ సినిమా గురించి నాతో మాట్లాడలేదు. వైఎస్సార్‌సీపీ అభిమానుల నుంచి మా సినిమాకు మద్దతు లభిస్తుందేమో నాకు తెలీదు.

► ఏ ఇండస్ట్రీలో సినిమా చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది అనే విషయం మనం చేస్తున్న సినిమాపై ఆధారపడి ఉంటుంది. వందకోట్లతో సినిమా చేయవచ్చు. యాభైలక్షలతో కూడా చేయవచ్చు. మన సినిమాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. అప్పుడు మన నటనలో తేడా తెలుస్తుంది. ఇందుకోసం నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రతిభ ఉండటమే కాదు. దాన్ని నిరూపించుకునేందుకు కష్టపడటం కూడా ముఖ్యమే. ఇప్పటికీ నా సహచర నటులను చూసి ఇన్‌స్పైర్‌ అవుతుంటాను.

► అప్పటి ‘స్వాతికిరణం’ సినిమాలో ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటే ఇందుకు కారణం నాకు తెలీదు. దేవుడి దయ అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. నాది 1980 బ్యాచ్‌ కాదు. 2018 బ్యాచ్‌.

► నా మలయాళ చిత్రం ‘మధుర రాజా’ షూటింగ్‌ జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌ అనుకుంటున్నాం. కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాను. వెబ్‌ సిరీస్‌లో నటించే ఆలోచన ప్రస్తుతం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top