చేసినవే చూపించండి... చేయనివి వద్దన్నారు

Yatra Producer Vijay Chilla Interview - Sakshi

‘‘ఆనందో బ్రహ్మ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కోసం చెన్నై వెళ్లాం. అప్పుడు ‘యాత్ర’ ఐడియా గురించి చెప్పాడు మహి. ఫస్ట్‌ ‘యాత్ర’ కథ నాకు చెప్పలేదు. జస్ట్‌ ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ డైలాగ్‌కి సంబంధించిన సీన్‌ మాత్రమే చెప్పాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పా. సినిమా మొత్తం ఇదే ఎమోషన్‌ ఉంటే తప్పకుండా చేద్దాం అన్నాను’’ అని విజయ్‌ చిల్లా అన్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో నటించారు. మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ చిల్లా విలేకరులతో మాట్లాడారు.
 

యాత్ర’ పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో ఉన్న కమర్షియల్‌ ఎలిమెంట్‌ ఏంటంటే.. ‘ఎమోషన్‌’. 2 గంటల పాటు ప్రేక్షకులు ఎమోషన్‌తో ఎంగేజ్‌ అవుతారు. పాదయాత్ర నాటికి వైఎస్సార్‌గారి లుక్స్‌కి, సినిమాలో మమ్ముట్టిగారి లుక్స్‌కి చాలా తేడా ఉంది. డైలాగ్‌ మాడ్యులేషన్‌ విషయంలో కూడా వైఎస్సార్‌గారిలా మాట్లాడమని చెప్పలేదు. అలాగే వైఎస్సార్‌గారు ఎలా నడిస్తే చాలా నడవాలని చెప్పలేదు. పాత్రను అవగాహన చేసుకుని మమ్ముట్టిగారు నటించారు.

మేం తీసిన ‘భలే మంచి రోజు’కి శ్యామ్‌ దత్‌గారు కెమెరామేన్‌గా చేశారు. ఆయన ద్వారానే మమ్ముట్టిగారిని సంప్రదించాం. అప్పుడు ఆయన వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నారు. గ్యాప్‌లో లైన్‌ విన్నారు. ఆ తర్వాత ఓ రోజు పిలిచి కథ విని, పదిరోజుల్లో పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మన్నారు. మరో రోజు వెళ్లినప్పుడు మొత్తం కథ తెలుగులోనే విన్నారు. మధ్యలో మహి కొంచెం ఇంగ్లీష్‌ వాడినా తెలుగులోనే చెప్పమనేవారు. ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగి మళ్లీ మళ్లీ చదివించుకుని 10 గంటల పాటు కథ విన్నారు. మహి, నా కెరీర్‌లో లాంగెస్ట్‌ నెరేషన్‌ అంటే అదే.

కథ విని నటించేందుకు మమ్ముట్టిగారు ఒప్పుకున్నా వెంటనే డేట్స్‌ ఇవ్వలేకపోయారు. 3, 4 నెలలు వేచి ఉండగలిగితే సినిమా చేద్దాం అన్నారు. ఓ రోజు ఫోన్‌ చేసి 45 రోజులు డేట్స్‌ ఉన్నాయి చేయగలరా? అన్నారు. కుదరదు సార్‌.. మాకు 3 నెలలు కావాల్సిందే అని రిక్వెస్ట్‌ చేశాం. మామూలుగా అయితే 90 రోజుల్లో మలయాళంలో రెండు సినిమాలు చేసేయొచ్చు. కానీ మన దగ్గర వీలుపడదు. వైఎస్సార్‌గారి పాదయాత్ర ప్రధానాంశం కాబట్టి ఈ సినిమాలో దాదాపు ప్రతి సీన్‌లో ఎక్కువమంది జనాలు ఉంటారు. అందుకే ఎక్కువ రోజులు అడిగాం. మమ్ముట్టిగారు ఓకే అన్నారు.

‘యాత్ర’ సినిమా ఒక ఈవెంట్‌ బేస్డ్‌ మూవీ. కొన్ని బయోపిక్స్‌ ఎలా ఉంటాయంటే.. పుట్టినప్పటి నుంచి బిగిన్‌ అయి, చనిపోయే వరకూ ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైన అంశం చుట్టూ తిరుగుతాయి. మా సినిమా మాత్రం వైఎస్సార్‌గారి జీవితాన్ని ప్రభావితం చేసిన పాదయాత్ర చుట్టూ తిరుగుతుంది. బయోపిక్‌లో అన్నీ కరెక్ట్‌గా చూపించడానికి కుదరదు. అలా చూపిస్తే డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే వైఎస్సార్‌గారి జీవితంలో జరిగిన  వాస్తవాలనే సినిమాటిక్‌ లిబర్టీతో సినిమా ఫార్మాట్‌లో చూపించాం.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు పాదయాత్రలో ఉన్నప్పుడు కలిసి, ఈ సినిమా గురించి చెప్పాము. ఆయన ఇన్‌పుట్స్‌ ఇస్తారేమో అనుకున్నాం. కానీ ‘మా నాన్నగారు చేసిందే చూపించండి.. చేయనివి చూపించకండి. ఇది మీ నాయకుడి సినిమాలా మీ వెర్షన్‌లో మీరు చేస్తున్నారు. అలాగే చేయండి’ అని ఆయన అన్నారు. అంతకుమించి ఈ బయోపిక్‌లో జగన్‌గారి ప్రమేయం లేదు. ‘యాత్ర’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా వెనక ఏ పార్టీ బ్యాకింగ్‌ లేదు. మా అంతట మేమే తీశాం. మేమే రిలీజ్‌ చేస్తున్నాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top