పొట్టకూటి కోసం పొగడ్తలు

web series Bhajana Batch poster launch - Sakshi

‘‘ప్యారాషూట్‌ లేకుండా మనిషిని గాల్లో తేలగలిగేలా చేసేది పొగడ్త. దానికి పడని వాళ్లు ఉండరు. అలాంటి పొగడ్తనే ప్రవృత్తిగా పెట్టుకున్న ఒక కుటుంబానికి సంబంధించిన కథే మా ‘భజన బ్యాచ్‌’ సిరీస్‌. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు దర్శకుడు చిన్నికృష్ణ. దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్సెప్ట్‌ ఆధారంగా చిన్నికృష్ణ రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘భజన బ్యాచ్‌’. పోసాని కృష్ణమురళి, గెటప్‌ శ్రీను, జెమిని సురేశ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం సోనీ లైవ్‌లో ప్రసారం అవుతోంది.

ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా, ఒక్కో ఎపిసోడ్‌ 20 నిమిషాల నిడివితో రూపొందించాం. పొగడ్తల ద్వారా జీవితం సాగిస్తారు పోసాని. వాళ్ల పిల్లలను కూడా ఇదే వృత్తిని కొనసాగించమనడంతో తన పిల్లలు కూడా భజన చేయడం మొదలుపెడతారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కొక్కరి చుట్టూ చేరి భజన చేస్తారు. ఈ మధ్య  సోషల్‌ మీడియాలో పాపులారిటీ పొందిన వాళ్లను స్ఫూప్‌ చేశాం. విషం తీసుకుంటాను కానీ పొగడ్తలను తీసుకోను అనే మనస్తత్వం ఉన్న అజయ్‌ ఘోష్‌ వీళ్ల ఆటలు కట్టించాలనుకుంటాడు. ముందుగా సినిమాలా చేసి వెబ్‌ సిరీస్‌ స్టయిల్‌లో కట్‌ చేశాం. నాకు జంధ్యాలగారు, ఈవీవీగారు అంటే చాలా అభిమానం. 

వాళ్ల స్టయిల్‌ కామెడీ ఇందులో ఉంటుంది. నాటకరంగంలో నటుడిగా నాలుగు స్టేట్‌ అవార్డులు అందుకున్నాను. వినాయక్‌గారిని నటుడిగా అవకాశం అడిగితే రైటింగ్‌ టీమ్‌లోకి తీసుకున్నారు. ఆయన వద్ద ‘కృష్ణ, అదుర్స్‌’ సినిమాలకు వర్క్‌ చేశాను. ‘వీడు తేడా, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, లండన్‌ బాబులు’ సినిమాలకు దర్శకత్వం వహించాను. ‘కొత్తబంగారు లోకం, ఖైదీ నంబర్‌ 150’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాను. దర్శకులకు సినిమా సినిమాకు చిన్న గ్యాప్‌ రావడం సహజం. ఇకపై ఆ గ్యాప్‌లో  వెబ్‌ సిరీస్‌లు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను తెరకెక్కించిన ‘అక్షర’ సినిమాని ఈ నెలాఖరులో  విడుదల చేయానున్నాం’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top