విజయ్‌ను వెంటాడుతున్న చోరీ కేసులు | Sakshi
Sakshi News home page

విజయ్‌ను వెంటాడుతున్న చోరీ కేసులు

Published Sun, Apr 21 2019 8:20 AM

Vijay And Atlee Story Is Copied - Sakshi

పెరంబూరు: ఇళయదళపతి విజయ్‌ను విజయాలు వరిస్తున్నా, కథల చోరీ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన నటించిన కత్తి చిత్రం నుంచి నిన్నటి సర్కార్‌ వరకూ కథల చోరీ కేసులు, కోర్టులు, పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. సర్కార్‌ చిత్ర కథ విషయంలో చోరీ జరిగిందని కథా రచయితల సంఘం అధ్యక్షుడు వెల్లడించడం పెద్ద వివాదానికే దారి తీసింది. అంతే కాదు ఆ చిత్ర దర్శకుడు మురుగదాస్‌ పిటీషన్‌దారుడికి కొంత మొత్తాన్ని చెల్లించుకోక తప్పలేదని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అంతకు ముందు కత్తి చిత్రం విషయంలోనూ కథ చోరీ ఆరోపణలు ఎదురయ్యాయి. తాజాగా విజయ్‌ నటిస్తున్న చిత్రం కూడా కథ చోరీ ఆరోపణలను ఎదుర్కొంటోంది.

విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయకి. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ను నిర్విరామంగా జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్వ అనే లఘు చిత్రాల దర్శకుడు విజయ్‌ నటిస్తున్న 63వ చిత్ర కథ తనదంటూ చెన్నై హైకోర్టుకెక్కారు. అందులో మహిళా ఫుట్‌బాల్‌ క్రీడ ఇతి వృత్తంతో కూడిన కథను తాను 265 పేజీలు రాసుకున్నానని తెలిపారు. ఆ  కథను పలువురు నిర్మాతలకు వినిపించానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు అట్లీ ఈ కథను నటుడు విజయ్‌ హీరోగా తెరకెక్కిస్తున్నారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిత్ర షూటింగ్‌పై నిషేధం విధించాలని పిటీషన్‌లో కోరారు. ఈ కథ చోరీ కేసుపై ఈనెల 23వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. కాగా పిటీషన్‌దారుడు దర్శకుడు అట్లీని, నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థను, కథా రచయితల సంఘాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఈ పిటీషన్‌పై తగిన వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీఎస్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

Advertisement
Advertisement