అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్‌

Venkatesh speech at F2 Grand Success Meet - Sakshi

వెంకటేశ్‌

‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’ని హిట్‌ కాదు.. సూపర్‌ హిట్‌ కాదు.. సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌ చెబుతున్నా’’ అని వెంకటేశ్‌ అన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది.

శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్‌ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్‌. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్‌ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్‌ ఫీలింగ్‌.

ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థ్యాక్స్‌ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్‌ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్‌ హిట్‌ చేశారు.

అనిల్‌ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్‌ సినిమా ఇచ్చినందుకు ‘దిల్‌’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్‌. అనిల్‌ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్‌ టెరిఫిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్‌ని అనిల్‌ ‘ఎఫ్‌ 2’ అని అనౌన్స్‌ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్‌గారు, వరుణ్‌గారు జాయిన్‌ అయ్యారు. సినిమా రిలీజ్‌ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) కొందరు మెసేజ్‌లు పంపించారు. ఫైనల్‌గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్‌బస్టర్‌) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ  సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్‌ అంతా చాలా ఎంజాయ్‌ చేస్తున్నాం.ఈ సక్సెస్‌ అనిల్‌ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్‌ అందరిదీ.

మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్‌ వచ్చింది. ఈ సినిమా హిట్‌ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్‌ మా టీమ్‌తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్‌గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్‌లో ఉన్నారు. వరుణ్‌ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్‌లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్‌ 2’ తో 50కోట్ల క్లబ్‌ దాటేశారు. మా బ్యానర్‌కి హయ్యస్ట్‌ ప్రాఫిట్‌ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఎఫ్‌ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు బిగ్‌ థ్యాంక్స్‌. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్‌ ఉంటుంది. మా ‘ఎఫ్‌ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్‌. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్‌గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది.

వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్‌ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్‌ఫ్రెండ్‌. మీతో పనిచేయడం మరచిపోలేను.  వెంకీగార్ని, అనిల్‌గార్ని, ఈ టీమ్‌ని మిస్‌ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్‌ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్‌ 3’  సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్‌ వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్‌. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్‌పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్‌. తమన్నా, మెహరీన్‌ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్‌ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్‌ అబ్బ.

ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్‌ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్‌ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.  మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్‌ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్‌.  ‘ఎఫ్‌ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు.  

 నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ,  పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top