
తెలుగు సినిమాలకు తెలుగు పేర్లే!
తెలుగు సినిమాల పేర్లు తెలుగులోనే పెడుతున్నారు. తెలుగు సినిమా పేర్లు తెలుగులో కాక వేరే భాషలో పెడతారా అంటారా.
తెలుగు సినిమాల పేర్లు తెలుగులోనే పెడుతున్నారు. తెలుగు సినిమా పేర్లు తెలుగులో కాక వేరే భాషలో పెడతారా అంటారా. అయితే ఓసారి ఈ పేర్లు చదవండి. హార్ట్ ఎటాక్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, లెజెండ్, ఇడియట్, బాద్షా, చమ్మక్ చల్లో, రేస్, 3జీ లవ్, షాడో, జఫా, కెమిస్ట్రీ... ఇవన్నీ అచ్చ తెలుగు సినిమా టైటిల్స్ అంటే నమ్మాల్సిందే. తెలుగు సినిమాలకు అన్యభాషల పేర్లు పెట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారుతోంది.
'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' పేరు ప్రకటించినప్పుడు పెదవి విరిచిన వారే ఎక్కువ. ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించిన సినిమాకు క్యాచీ టైటిల్ పెట్టాలని తలపోసిన వారే ఎక్కువ. అయితే ఈ సినిమా విజయం సాధించడంతో పెదవి విరిచిన వారి నోళ్లు మూతపడ్డాయి. తెలుగులో సినిమా పేర్లకు బాటలు పడ్డాయి. అమ్మ భాషలోనే కాకుండా కాస్త కవితాత్మకంగానూ పేర్లు పెడుతున్నారు. పాటల్లోని వాక్యాలనూ శీర్షికలుగా సినిమా తెరపై దర్శనమిస్తున్నాయిప్పుడు.
నిన్న మొన్నటి వరకు మాస్ టైటిల్స్ తో ఊదరగొట్టిన యువహీరోలు కూడా ఇప్పడు తెలుగుదనంపై మక్కువ చూపడంతో సినిమా పేర్లు తెలుగీకరణ సంతరించుకుంటున్నాయి. గోవిందుడు అందరి వాడేలే, రామయ్యా వస్తావయ్యా, గోపాల గోపాల, ముకుంద, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, అత్తారింటికి దారేది, ఊహలు గుసగుసలాడే, పాండవులు పాండవులు తుమ్మెద, చందమామ కథలు, అడవి కాచిన వెన్నెల, గుండెజారి గల్లంతయిందే ఇందుకు 'మెచ్చు'తునకలు. ఈ మార్పును బాషా ప్రేమికులు, ప్రేక్షకులు ఆహ్వానిస్తున్నారు. తెలుగుతెరపై అమ్మను భాష మన్నన దక్కడం ముదావహంగా భావిస్తున్నారు.