‘ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండు’

Sushant Singh Rajput No More: Celebrities Shocked And Tributes - Sakshi

‘ఎంఎస్‌ ధోని’ బయోపిక్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త బాలీవుడ్‌ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్‌ హఠాన్మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్‌ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోతోంది. సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సుశాంత్ మరణ వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ వారు ట్వీట్లు చేస్తున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

‘అద్భుత ప్రతిభ గల యువ నటుడు సుశాంత్‌ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్‌, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. కెరీర్‌ పరంగా అయన ఎదిగిన తీరు అందరికీ స్పూర్థిదాయకం. మరిచిపోలేని ​ఎన్నో అనుభూతులను మనకు మిగిల్చి ఆయన వెళ్లిపోయారు. సుశాంత్‌ మరణించారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి’- ప్రధాని నరేంద్రమోదీ

‘సుశాంత్ మృతి చెందాడన్న వార్త విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. ఇటీవలే సుశాంత్ నటించిన చిచోరే సినిమా చూశాను. ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. తాను కూడా ఆ సినిమాలో భాగస్వామ్యం అయి ఉంటే బాగుండేది అనుకున్నాను. నిజంగా సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో’ - అక్షయ్‌ కుమార్‌

‘సుశాంత్ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను. నా దగ్గర మాటల్లేవు. నా గుండె పగిలింది. ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండు’. - సోనూసూద్‌

‘ఈ వార్త వినడం నిజంగా బాధాకరం. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలి’ - అజయ్‌ దేవగన్‌

‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ లేరనే వార్త నన్ను ఎంతగానో బాధించింది. ప్రతిభావవంతుడైన యవ నటుడు అతడు. అతడి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలయజేస్తున్నా. సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’ - సచిన్‌ టెండూల్కర్‌

‘సుశాంత్‌ సింగ్‌ విషాదకరమైన మరణవార్తను విని షాక్‌ అయ్యాను. ప్రతిభ, అవకాశాలతో కూడిన జీవితం అకస్మాత్తుగా ముగిసింది. అతడి కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి’ - టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి

‘ఆ మాటలు నన్ను షాక్‌కు గురిచేశాయి. హృదయం ముక్కలైంది. నిజంగా విషాదకరమైన వార్త. మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయాడు’ -  తరణ్‌ ఆదర్శ్

‘జేమ్స్‌ డీన్‌, హీత్‌ లెడ్జర్‌ మరణించిన తర్వాత నన్ను షాక్‌కు గురిచేసింది సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం. కరోనా వైరసే కాకుండా ఆ దేవుడు కూడా బాలీవుడ్‌పై పగబట్టినట్లు ఉన్నాడు’ - రామ్‌గోపాల్‌ వర్మ   

‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ అకాల మరణం అనే మాటలు విని షాక్ అయ్యాను. ప్రతిభావంతుడైన యువకుడు. అతని ఆత్మ శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నాను. సుశాంత్‌ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ - మహేశ్‌ బాబు

చదవండి:
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య
బాలీవుడ్ హీరో మాజీ మేనేజ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top