నవ్వుతూ సెండాఫ్‌ చెబుతారు

Sunil at 2 Countries Movie Interview - Sakshi

‘‘హీరో అయిపోవాలనుకోగానే ఎవరూ అయిపోరు. నా విషయంలోనూ అంతే. కమెడియన్‌గా మంచి సక్సెస్‌ చూశా. ప్రేక్షకులకు అంతలా దగ్గరయ్యాను కాబట్టే హీరోగా అవకాశాలొచ్చాయి’’ అని హీరో సునీల్‌ అన్నారు. సునీల్, మనీషారాజ్‌ జంటగా ఎన్‌. శంకర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘2 కంట్రీస్‌’ రేపు విడుదలవుతోంది. సునీల్‌ పంచుకున్న విశేషాలు...

► ప్రస్తుతం నా ఇమేజ్‌కి సూట్‌ అయ్యే సినిమా ‘2 కంట్రీస్‌’. 95% కామెడీ ఉండటంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాకి ఓకే చెప్పేశా. మిగిలిన 5% క్లైమాక్స్‌కి ముందు హార్ట్‌ టచింగ్‌ ఎమోషన్స్‌ ఉంటాయి.

►మలయాళ ‘2 కంట్రీస్‌’ సినిమాకి ఇది రీమేక్‌ అయినా తెలుగులో పెద్దగా మార్పులు చేయలేదు. సెకండాఫ్‌లో స్లో అనిపించినప్పుడు  సీన్స్‌ కొంచెం షార్ప్‌ చేశామే కానీ, కథలో మార్పులు చేర్పులు చేయలేదు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ఒక ఊళ్లో ఉండే పాత్ర నాది. ఈ ఏడాది చివరలో వస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు నవ్వుతూ 2017కి సెండాఫ్‌ చెబుతారు. అది మాత్రం గ్యారంటీ.

►గతంతో పోల్చితే కామెడీ సినిమాలు తగ్గాయి. బాపు, జంధ్యాల, ఈవీవీగార్లలా కామెడీ సినిమాలు చేసేవాళ్లు ఇప్పుడు అంతగా లేరు. త్రివిక్రమ్‌ నాతో ‘బంతి’ సినిమా చేస్తానన్నాడు. ఇప్పుడు తను ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడుతున్నాడు. నాతో గల్లీ క్రికెట్‌ ఆడమని చెప్పలేను.

►పాత్ర బాగుంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. గ్యాప్‌ వచ్చినా పర్లేదు కానీ, ఇకపై మంచి సినిమా అయితేనే హీరోగా చేస్తా. ‘అందాల రాముడు’ తర్వాత ‘మర్యాద రామన్న’ వంటి చిత్రం వచ్చే వరకు 5 ఏళ్లు వెయిట్‌ చేశానే కానీ, నచ్చకపోతే చేయలేదు. ఇప్పుడూ అంతే.

►ఈ ఏడాది వచ్చిన నా సినిమాల్లో ‘2 కంట్రీస్‌’ బెస్ట్‌ సినిమా అవుతుంది. రెండు సినిమాలు కమెడియన్‌గా ఓకే చేశా. హీరోగా కథలు వింటున్నా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top