రవి మొండితనం  నచ్చింది

Special chit chat with producer daggubati suresh babu - Sakshi

‘‘ప్రయోగాత్మక సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అందుకే ‘పెళ్ళిచూపులు, కంచెరపాలెం’ వంటి డిఫరెంట్‌ సినిమాలకు సపోర్ట్‌ చేశాను. కొత్త ఫిల్మ్‌ మేకర్స్‌కు, కొత్త ఆలోచనలకు ఎవరో ఒకరు మద్దతుగా నిలవాలి. అప్పుడే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ వస్తుంటుంది’’ అన్నారు నిర్మాత సురేశ్‌బాబు. బంటి (పందిపిల్ల) ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సమర్పకులు సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు...

∙‘అదుగో’ సినిమా ఐడియాను రవిబాబు చెప్పినప్పుడు బాగా ఎగై్జట్‌ అయ్యాను. ఒక్క ‘సోగ్గాడు’ తప్ప మా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాగానే ఆడాయి. ‘అదుగో’ చాలా కష్టమైన సినిమా. త్రీడీ యానిమేషన్‌లో చేయాలనుకున్నాం. చాలా డబ్బులు ఖర్చుపెట్టిన తర్వాత యానిమాట్రానిక్‌ పిగ్‌ (యానిమేషన్‌ పిగ్‌) వర్కౌట్‌ కాలేదు. అప్పుడు త్రీడీ ఆలోచన వచ్చింది. రవి బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అన్ని పనులను తను దగ్గరుండి చేశాడు... చేయించాడు కూడా. అందుకే క్రెడిట్‌ మొత్తం తనకే దక్కుతుంది. ఒక దశలో ఈ సినిమాను వదిలేద్దాం అన్నాను. నో సార్‌ అన్నాడు. రవి మొండితనం బాగా నచ్చింది.

∙ ఇందులో పంది, 3 కుక్కల ఫైట్‌ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో పిల్లుల చేజ్‌లు, పిగ్‌ రేస్‌లు ఉన్నాయి. సినిమాలో బంటి వల్ల రాజధాని భూముల రేట్లు పెరుగుతాయి. లోకల్‌ గూండాల పనులు తగ్గుతాయి. అవి ఎలా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం. సీక్వెల్‌ ఆలోచనలు కూడా ఉన్నాయి. 

∙ ‘అదుగో’ హిట్‌ సాధిస్తుందో లేదో తెలీదు. కానీ జానర్‌ నచ్చింది. లైవ్‌ యాక్షన్‌ యానిమేషన్‌ను నమ్మాను. ఈ టెక్నాలజీ గురించి రాజమౌళికి, శంకర్‌కి తెలుసు. ఈ ఇద్దరూ అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచిస్తారు.టెక్నికల్‌ స్టాండర్ట్స్‌ను పెంచుతున్నారు. ఎక్కువమంది ఇలా ఆలోచిస్తే మన సినిమా స్థాయి పెరుగుతుంది. 

∙ మా నాన్నగారి (డి. రామానాయుడు) బయోపిక్‌ కోసం ఇద్దరు ముగ్గురు అడిగినా చేయాలనుకోవడం లేదు. ఓ రెజ్లర్‌ లైఫ్‌ ఆధారంగా సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. రానా ‘హిరణ్య’ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ సినిమాకు లీడ్‌ ప్రొడ్యూసర్‌ కూడా రానానే. నేను ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. నక్కిన త్రినా«థరావు, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ ఉంటుంది. తెలంగాణ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ‘దొరసాని’ సినిమా జరుగుతోంది. దర్శకుడు రవికాంత్‌ పేరెపుతో చేస్తున్న సినిమా తుది దశకు వచ్చింది. సమంత హీరోయిన్‌గా నందినీరెడ్డి దర్శకత్వంలో కొరియన్‌ రీమేక్‌ ‘మిస్‌ గ్రానీ’ ఉంది. ‘వెంకీమామ’ ఈ ఏడాదిలోనే స్టార్ట్‌ అవుతుంది. తరుణ్‌ భాస్కర్‌తో సినిమాలు ఉన్నాయి. ఆయన ఒక సినిమాను డైరెక్ట్‌ చేస్తారు. ఇంకో సినిమాకు కో–ప్రొడ్యూసర్‌. కొత్త అబ్బాయి నానితో నేనూ, రామ్మోహన్‌ ఓ సినిమా ప్లాన్‌ చేశాం. ‘కంచెరపాలెం’ నిర్మాత ప్రవీణతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నా. వేణు ఊడుగులతో ఓ సినిమా ఉంది.

ఆయుష్మాన్‌ ఖురానా చేసిన హిందీ సినిమా ‘అందాథూన్‌’ బాగుందని, చూడమని సన్నిహితులు చెప్పారు. చూసి వస్తున్నప్పుడు సడన్‌గా నా కారు ఓ రాయిపై ఎక్కింది. టైర్‌ పగిలింది. ప్రమాదం జరిగింది. వెంటనే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాను. బ్రీత్‌ టెస్ట్‌ చేశారు. జీరో వచ్చింది. ప్రమాదం నా తప్పు కాదు. వెహికల్‌ మిస్టేక్‌ కూడా ఉంది. ఇందులో గాయపడినవాళ్లందరూ నార్మల్‌గా వచ్చే వరకూ నాదే బాధ్యత.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top