మా అబ్బాయి నాకు అమ్మలా మారాడు

Sonali Bendre on how son Ranveer is her support through fighting - Sakshi

ఇటీవలే తనకు క్యాన్సర్‌ ఉందనే వార్తను తెలిపి అందర్నీ షాక్‌కి గురి చేశారు సోనాలీ బింద్రే. అయితే క్యాన్సర్‌కు కుంగిపోకుండా ధైర్యంగా పోరాడటానికి సిద్ధపడ్డారామె. ఈ పోరాటంలో సోనాలీకి ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ అందరూ ధైర్యం చెప్పారు. ‘‘ఆ ప్రేమాభిమానాలు నాకు కొండంత ధైర్యం’ అని సోనాలి సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇటీవల  కీమోథెరపీ కోసం తన కురులను కూడా కట్‌ చేసుకున్నప్పుడు ట్వీటర్‌ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు మరో విషయం గురించి పేర్కొన్నారు.

ఈసారి సోనాలి తన కుమారుడు రణ్‌వీర్‌ గురించి చెప్పారు. రణ్‌వీర్‌ వయసు 12 ఏళ్లు. తల్లి అనారోగ్యం గురించి తెలిసి, తను ఎలా రియాక్ట్‌ అయ్యుంటాడు? ఇదే విషయాన్ని సోనాలి గురువారం తెలుపుతూ – ‘‘రణ్‌వీర్‌ పుట్టిన 12 సంవత్సరాల, 11 నెలల, 8 రోజుల నుంచి మా హార్ట్‌ని వాడే ఆక్రమించేసుకున్నాడు. అప్పటి నుంచి వాడి ఆనందం, సంతోషమే మాకు ముఖ్యమయ్యాయి. నాకు క్యాన్సర్‌ అని తెలిసినపుడు వాడికి ఈ విషయం ఎలా తెలియజేయాలో అని గోల్డీ (సోనాలి భర్త), నేను చాలా ఆలోచించాం.

వాడిని ప్రొటెక్ట్‌ చేయడం ఎంత ముఖ్యమో, వాడికి నిజాన్ని చెప్పడం కూడా అంతే ముఖ్యమని భావించాం. ఇప్పటివరకు  మేం ప్రతీ విషయంలో వాడితో ఓపెన్‌గా, నిజాయితీగా ఉన్నాం. ఈసారి కొంచెం డిఫరెంట్‌. కానీ వాడు ఈ విషయాన్ని చాలా మెచ్యూర్డ్‌గా తీసుకున్నాడు. నాకు సపోర్ట్‌గా, పాజిటీవ్‌గా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మా పాత్రలు మారుతున్నాయి. నేను ఏ మందులేసుకోవాలో ఓ  అమ్మలా గుర్తు చేస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది.. పిల్లల్ని ఇలాంటి అత్యవసర సమయాల్లో  ఇన్వాల్వ్‌  చేయడం మంచిదని.

మనం అనుకున్నదాని కంటే వాళ్లు చాలా స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతారు. వాళ్లను ఇన్వాల్వ్‌ చేయడం, వాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేయడం లాంటివి చేయాలి. వాళ్ల దగ్గర నిజాలు దాచి, జీవితం యొక్క కఠినత్వం చెప్పకుండా వాళ్లను కాపాడుకోవాలనుకుంటాం కానీ, అది పొరపాటు. ప్రస్తుతం రణ్‌వీర్‌ సమ్మర్‌ హాలిడేస్‌ని  నాతోనే గడుపుతున్నాడు. వాడి అల్లరి, విన్యాసాలే నాకు ఎనర్జీ ఇస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరం ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాం’’ అని సోషల్‌ మీడియాలో పేర్కొని తనయుడితో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు సోనాలీ బింద్రే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top